'గాడ్ ఫాదర్' కోసం రాయలసీమకు మెగాస్టార్..!

Sun Sep 25 2022 09:32:32 GMT+0530 (India Standard Time)

Megastar Chiranjeevi Godfather Pre Release

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.'గాడ్ ఫాదర్' మెగా ఈవెంట్ ను నీ నెల 28వ తారీఖున అనంతపురంలోని జేఎన్‌టీయూ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. చాలా కాలం తర్వాత హైదరాబాద్ వెలుపల చిరంజీవి సినిమా ఫంక్షన్ బహిరంగ ప్రదేశంలో జరగబోతోందని చెప్పాలి. అంతేకాదు చాలా గ్యాప్ తర్వాత సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ రాయలసీమలో అడుగుపెట్టబోతున్నారు.

'గాడ్ ఫాదర్' ఈవెంట్ కు చిరంజీవి సహా యూనిట్ మొత్తం హాజరుకానున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమానికి తరలి వస్తారని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ దగ్గరుండి అన్ని విషయాలు పర్యవేక్షణ చేస్తున్నారు.

కాగా 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవితో పాటుగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నారు. ఇద్దరు మెగాస్టార్స్ కలిసి చేస్తున్న చిత్రం కావడంతో.. అందరిలో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన 'తార్ మార్' సాంగ్ అలరించింది.

మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 'గాడ్ ఫాదర్' అనేది హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో చిరంజీవి మాస్ లీడర్ గా కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ షార్ఫ్ షూటర్ గా నటించారు. నయనతార - సత్యదేవ్ - సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.

కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఆర్‌బి చౌదరి మరియు ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని తెలుగుతో పాటుగా హిందీ - మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.