మలయాళం జోలికి వెళ్లకపోవడమే మంచిదేమో!

Sun Sep 25 2022 09:58:34 GMT+0530 (India Standard Time)

Megastar Chiranjeevi Godfather Movie

చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందింది. ఎన్వీ ప్రసాద్ - ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వదులుతున్న మెగాస్టార్ పోస్టర్లు అంతకంతకూ అంచనాలు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త బలంగానే షికారు చేస్తోంది. ఈ సినిమాను మలయాళంలోకి డబ్ చేసి వదలనున్నారనేదే ఆ వార్త సారాంశం. విషయమేమిటంటే 'గాడ్ ఫాదర్' సినిమా కథ మలయాళం నుంచి పట్టుకొచ్చిందే. మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్'కి ఇది రీమేక్. మోహన్ లాల్ కెరియర్ లో చెప్పుకోదగిన సినిమాగా ఇది నిలిచింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యంత భారీ వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ను అక్కడి ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు కూడా. ఆ సినిమాలో మోహన్ లాల్ నటనకు వాళ్లంతా హారతులు పట్టారు. ఆయన తన వయసుకి తగిన పాత్రను అద్భుతంగా ఆవిష్కరంచారని అభినందనలతో ముంచెత్తారు.

మలయాళ ఆడియన్స్ సహజత్వానికి పెద్ద పీట వేస్తారు. అనవసరమైన ఆర్భాటాలను వాళ్లు ఆశించరు. అక్కడ పాత్రలో నుంచి బయటికి రాకుండా హీరో చూసుకుంటాడు. కానీ తెలుగులో హీరో క్రేజ్ కి తగినట్టుగా పాత్ర ఉండాలి. అందువల్లనే తెలుగుకి సంబంధించిన కథలో మార్పులు చేయడానికి మోహన్ రాజాకి చాలా సమయం పట్టింది. అంతలా మార్చిన కథను తిరిగి మలయాళంలోనే రిలీజ్ చేద్దామనే ఆలోచన సాహసంతో కూడుకున్న పనే అనుకోవాలి. వాళ్ల సంప్రదాయ వంటకానికి మన మసాలా జోడించి పార్సిల్ పంపించినట్టుగా ఉంటుంది.

ఈ మధ్య కాలంలో చిరంజీవి మలయాళ  ప్రేక్షకులకు టచ్ లో లేరు. సల్మాన్ ఖాన్ ఉన్నాడు కదా అని పొలోమని థియేటర్స్ కి వచ్చే పద్ధతి మలయాళ ప్రేక్షకులకి అలవాటు లేని పని. వాళ్లు ఈ సినిమా గురించి ఆలోచన చేయడానికి ఉన్న ఏకైక అవకాశం నయనతార మాత్రమే. ఆల్రెడీ తెలిసిన కథ కావడం వలన ఆమె కోసం థియేటర్స్ కి వెళతారా అనేది కూడా అనుమానమే. 'గాడ్ ఫాదర్' ను మలయాళంలో రిలీజ్ చేయడం వలన నటన పరంగా పోల్చడం .. వసూళ్ల పరంగా పోల్చడం .. ట్రోలింగ్ వంటి వాటికి అవకాశం ఇవ్వడం అవసరమా? అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో మలయాళాన్ని టచ్ చేయడకపోవడమే మంచిదని అనుకుంటున్నారు.  ఫైనల్ గా ఏం జరుగుతుందనేది చూడాలి మరి.