'గాడ్ ఫాదర్'పై కౌంటర్లే కౌంటర్లు

Sun Sep 25 2022 09:22:43 GMT+0530 (India Standard Time)

Megastar Chiranjeevi Godfather Movie

మెగాస్టార్ చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలు చేస్తుండడం పట్ల సామాన్య ప్రేక్షకులతో పాటు అభిమానుల్లోనూ అసంతృప్తి ఉంది. ఒకప్పుడంట వేరు కానీ.. అన్ని భాషల సినిమాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్ సినిమా అనగానే ఆసక్తి సన్నగిల్లిపోతోంది. పైగా ఆయన తెలుగు వెర్షన్ సైతం అమేజాన్ ప్రైంలో అందుబాటులో ఉన్న లూసిఫర్ మూవీని రీమేక్ చేయడం చాలామందికి నచ్చట్లేదు.ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ రాకపోవడానికి రీమేక్ మూవీ కావడం ప్రధాన కారణం. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ కూడా ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించలేదు. ఐతే చిరు సినిమా అంటే రిలీజ్ టైంకి ఆటోమేటిగ్గా హైప్ వస్తుందనే ఆశతో ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు బాగానే అనిపిస్తున్నాయి. ఐతే 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేయబోతున్నట్లుగా లేటెస్టుగా వచ్చిన ప్రకటన మాత్రం సోషల్ మీడియా జనాలకు రుచించట్లేదు.

గాడ్ ఫాదర్ మూవీ మలయాళం సినిమా అయిన లూసిఫర్ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మలయాళీలు వేరే భాషల చిత్రాలను పెద్దగా పట్టించుకోరు. చిరంజీవికి అక్కడ పెద్దగా ఫాలోయింగ్ కూడా లేదు. వాళ్లు ఆల్రెడీ విరగబడి చూసిన మాస్ మసాలా మూవీని తెలుగులో రీమేక్ చేసి.. మళ్లీ మలయాళంలో రిలీజ్ చేయాలనుకోవడంలో ఔచిత్యమేంటో అర్థం కావడం లేదు. అసలు మలయాళ మార్కెట్ కూడా చాలా చిన్నది. వసూళ్లు చాలా తక్కువ వస్తాయి.

అలాంటి చోట కష్టపడి వాళ్ల సినిమాను రీమేక్ చేసి మళ్లీ మలయాళ వెర్షన్ రిలీజ్ చేయడం బిజినెస్ పరంగా కూడా ఏమంత ప్లస్ అయ్యే విషయం కాదు. గతంలో తెలుగు నుంచి తమిళంలోకి రీమేక్ అయిన నరసింహనాయుడు సినిమాను తిరిగి తెలుగులోకి అనువాదం చేసి రిలీజ్ చేయడం గుర్తుండే ఉంటుంది. అప్పుడు తమిళ అనువాదాల పట్ల మనవాళ్ల మోజు ఆ స్థాయిలో ఉండేది. దాని గురించి అప్పుడు కామెడీగా మాట్లాడుకునేవాళ్లు. ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీని మలయాళంలో రిలీజ్ చేయడం పట్ల అలాగే నెటిజన్ల నుంచి కౌంటర్లు పడుతున్నాయి.