Begin typing your search above and press return to search.

గోపీచంద్ ఈవెంట్ లో చిరూ కాలేజ్ ముచ్చట్లు!

By:  Tupaki Desk   |   27 Jun 2022 4:19 AM GMT
గోపీచంద్ ఈవెంట్ లో చిరూ కాలేజ్ ముచ్చట్లు!
X
గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' సినిమా రూపొందింది. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ చేసిన ఫస్టు సినిమా ఇది. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను, గీతా ఆర్ట్స్ 2 - యూవీ వారు కలిసి నిర్మించారు. యాక్షన్ తో ముడిపడిన కామెడీ డ్రామా ఇది. గోపీచంద్ ను మరింత ఫ్రెష్ గా చూపించడానికి మారుతి ట్రై చేశాడనే విషయం, పోస్టర్స్ చూస్తుంటేనే అర్థమైపోతోంది. సత్యరాజ్ .. రావు రమేశ్ .. ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, చిరంజీవి ముఖ్య అతిథిగా నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.

గోపీచంద్ తండ్రి టి.కృష్ణతో తనకి గల అనుబంధాన్ని గురించి చిరంజీవి ఈ స్టేజ్ పై ప్రస్తావించడం ఆసక్తికరంగా అనిపించింది. తన కాలేజ్ రోజులకు సంబంధించిన ఆ విషయాన్ని గురించి చిరంజీవి మాట్లాడుతూ .. సినిమాలతో సంబంధం లేని అనుబంధం నాకు గోపీచంద్ గారితో ఉంది.

ఈ విషయం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. గోపీచంద్ గారి తండ్రి టి. కృష్ణగారు గొప్ప దర్శకులు. ఒంగోలులో సీఎస్ ఆర్ శర్మ కాలేజ్ లో టి.కృష్ణగారు బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతుంటే .. అదే కాలేజ్ లో నేను జూనియర్ ఇంటర్ లో చేరాను.

కాలేజ్ కి కొత్తగా వచ్చిన నన్ను ఆయన పిలిపిస్తే .. బిక్కు బిక్కుమంటూ వెళ్లాను. కానీ ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. తాను స్టూడెంట్ లీడర్ గా నిలబడుతున్నట్టుగా చెప్పారు. తన నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఉంటుందంటూ ఒక భరోసా ఇచ్చారు.

కొత్తగా కాలేజ్ కి వచ్చిన నాకు ఆయన మాటలు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. అప్పటి నుంచి ఆయన నాకు ఒక హీరోగానే కనిపించేవారు. ఆ తరువాత ఇద్దరం సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. కాకపోతే ఇద్దరం కలిసి సినిమాలు చేసే అవకాశం రాలేదు.

విప్లవాత్మక చిత్రాలను .. సందేశాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ, చాలా తక్కువ సమయంలోనే ఆయన ఎంతో పేరును సంపాదించుకున్నారు. కాకపోతే మనకి ఆ భాగవతుడు అన్యాయం చేశాడు. సినిమా పట్ల ఆయనకి గల ప్రేమ .. అభిమానం గోపీచంద్ ద్వారా కొనసాగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గోపీచంద్ విలక్షణ నటుడిగా ఎదుగుతూ వస్తున్నారు. తను చేసిన సినిమాలు నేను చూశాను .. యాక్షన్ అదరగొట్టేస్తాడు. ఈ సినిమాలోను ఆ తరహా యాక్షన్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా థియేటర్స్ నుంచి ఎలాంటి రిజల్ట్ రాబడుతుందనేది ఇక్కడ మీ కేరింతలు చూస్తుంటేనే అర్థమైపోతోంది" అంటూ చెప్పుకొచ్చారు.