మారుతితో సినిమా చేస్తున్నాను: మెగాస్టార్

Mon Jun 27 2022 09:04:42 GMT+0530 (IST)

Mega star speach on pakka commercial movie pre release event

గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా 'పక్కా కమర్షియల్' సినిమా రూపొందింది. యూవీ క్రియేషన్స్ .. గీతా ఆర్ట్స్ 2 కలిసి ఈ సినిమాను నిర్మించారు. యాక్షన్ తో కూడిన కామెడీ డ్రామా ఇది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ దర్శకత్వం వహించాడు. జులై 1వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ - శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహించారు.ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి మాట్లాడుతూ .. " కోవిడ్  తరువాత ఇంతమంది అభిమానులు తరలి రావడం చూస్తుంటే నాకు ఎనలేని ఉత్సాహంగా ఉంది. ఎవరు ఎలాంటి సినిమా తీసినా మేమంతా కోరుకునేది ఇలాంటి కేరింతలే.

రేపటి రోజున ఈ సినిమాకి థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే దానికి మచ్చుతునకగా ఈ రోజున ఇక్కడ సందడి కనిపిస్తోంది. ఈ స్టేజ్ పై ఉన్న వీళ్లంతా కూడా ఈ ఫంక్షన్ కి వాళ్ల కోసం వచ్చానని  అనుకుంటున్నారు. కానీ నేను వచ్చింది అభిమానుల కోసం .. మీరిచ్చే ఉత్సాహం కోసం .. ప్రొత్సాహం కోసం. ఇక్కడి నుంచి నేను బోలెడంత ఎనర్జీని తీసుకుని వెళతాను.

గోపీచంద్ తో నాకు ఒక అనుబంధం ఉంది .. అదేమిటనే అనుమానం మీలో చాలామందికి వచ్చి ఉంటుంది. గోపీచంద్   తండ్రిగారు ఒంగోలులో బీకామ్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు అదే కాలేజ్ లో నేను ఇంటర్మీడియేట్ ఫస్టు ఇయర్. అప్పుడు ఆయన తన నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా ఉంటుందంటూ నాకు భరోసా ఇచ్చారు.

అలాంటి ఆయన నాకు ఎప్పుడూ కూడా ఒక హీరోలా కనిపించేవారు. ఆ తరువాత ఆయన దర్శకులై అనతికాలంలోనే మంచి పేరు ప్రతిష్ఠలను సంపాదించుకున్నారు. ఆయన వారసత్వాన్ని గోపీచంద్  కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది.

మారుతి విషయానికి వస్తే  తను గ్రాఫిక్స్ వర్క్ చేస్తుండే దగ్గర నుంచి నాకు తెలుసు. తనలో ఒక  డైరెక్టర్ ఉన్నాడనే విషయాన్ని నేను అప్పుడే చెప్పాను. నేను అనుకున్నట్టుగానే మారుతి  దిన దిన ప్రవర్ధమానమవుతూ వెళుతున్నాడు. ఆయన సినిమాలు నాకు బాగా నచ్చుతాయి .. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసినవాడు. అలాంటి మారుతితో సినిమా చేయమని యూవీ వంశీ - విక్రమ్ అడిగితే నేను హ్యాపీగా ఒప్పుకున్నాను. ఎందుకంటే మారుతి చేయగలడు .. ఆ నమ్మకం నాకు ఉంది. మారుతితో చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ స్టేజ్ పై  మా బేరం కుదిరిపోయింది" అంటూ చిరంజీవి నవ్వేశారు.