Begin typing your search above and press return to search.

'గాడ్ ఫాదర్'.. ఆసక్తిని రేకెత్తించే అంశాలు..!

By:  Tupaki Desk   |   30 Sep 2022 11:30 AM GMT
గాడ్ ఫాదర్.. ఆసక్తిని రేకెత్తించే అంశాలు..!
X
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా దసరా రిలీజ్ కు రెడీ అయింది. అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'లూసిఫర్' మూవీకి అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే.

రీమేక్ సినిమాలు చేస్తున్నప్పుడు పోలికలు అనేవి సహజంగా ఉండేవి. ఇప్పుడు 'గాడ్ ఫాదర్' విషయంలోనూ అదే జరుగుతోంది. ఫస్ట్ లుక్ విడుదలైన దగ్గర నుంచి.. మొన్న ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకూ ఒరిజినల్ మలయాళ వెర్షన్ కు తెలుగు వెర్సన్ కు కంపేర్ చేస్తూ వస్తున్నారు.

'లూసిఫర్' చిత్రంలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. మంజు వారియర్ - వివేక్ ఒబెరాయ్ - దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ - టోనిటో థామస్ కీలక పాత్రలు పోషించారు. తెలుగులో చిరంజీవి తో పాటుగా నయనతార - సత్యదేవ్ - సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించారు.

మాతృకలో కథాయికుడికి జోడీ ఉండదు.. కామెడీ డ్యాన్సులకు అసలు అవకాశం లేదు. అంతేకాదు ఫస్టాఫ్ లో ప్రధాన పాత్రకు 10-15 నిమిషాల నిడివి మాత్రమే దొరుకుతుంది.. సెకండాఫ్ అంతా అతనే కనిపిస్తాడు. ఇలాంటి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ను చిరంజీవి కి తగ్గట్టుగా ఎలా మార్చారనేది ఆసక్తికరంగా మారింది.

మెగాస్టార్ సినిమా అంటే ఫ్యాన్స్ చాలా అంశాలు ఎక్సపెక్ట్ చేస్తుంటారు. చిరు ఇమేజ్ తో పాటుగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు మోహన్ రాజా మరియు రచయిత లక్ష్మీ భూపాల్ కలిసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మెయిన్ ప్లాట్ ని తీసుకొని ఒరిజినల్ వెర్షన్ కంటే గ్రాండియర్ గా.. హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తీర్చుదిద్దే ప్రయత్నం చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

'గాడ్ ఫాదర్' లో చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ లపై 'తార్ మార్ తక్కర్ మార్' అనే పార్టీ సాంగ్ ని షూట్ చేశారు. ఇది సినిమాలో ఎండింగ్ లో రోలింగ్ టైటిల్స్ అప్పుడు ప్లే అవుతుందని సమాచారం. అలానే ఇక ఐటమ్ సాంగ్ కూడా ఉంది కానీ.. అందులో ఇంటర్ కట్స్ లో మాత్రమే చిరు కనిపిస్తారని అంటున్నారు.

లూసిఫర్ లో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించగా.. అతని భార్యగా మంజువారియర్ కనిపించింది. ఆ పాత్రలను తెలుగులో సత్యదేవ్ - నయనతార పోషించారు. నయన్ హస్బెండ్ గా.. నెగెటివ్ రోల్ లో సత్యదేవ్ ఎలా నటిస్తాడు? మెగాస్టార్ స్టార్ డమ్ ని ఎలా మ్యాచ్ చేస్తాడు? అనే ప్రశ్నలు అందరిలో ఉన్నాయి.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఓటీటీ పుణ్యమా అని 'లూసిఫర్' చిత్రాన్ని అందరూ చూసేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉండటం గమనార్హం. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసేసి ఉంటారు. అలాంటి చిత్రాన్ని ఇప్పుడు చిరంజీవి 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్ చేశారు.

ఆల్రెడీ తెలుగులో చూసేసిన చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేస్తున్నారంటే.. అది కచ్చితంగా ఒరిజినల్ కు మించిపోయే విధంగా ఉండాలి. దీనికి తోడు 'గాడ్ ఫాదర్' ను హిందీతో పాటుగా మలయాళంలోనూ డబ్బింగ్ చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళ సినిమాని రీమేక్ చేసి మళ్లీ వాళ్లకే తిరిగి చూపిస్తున్నాం. ఇదే నిజమైతే లూసిఫర్ కు ఏమాత్రం తగ్గినా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవలసి ఉంటుంది.

ట్రైలర్ లో చిరంజీవి కాలు పైదాకా లేపనందుకే మలయాళీలు సోషల్ మీడియాలో చిరంజీవి ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అలాంటిది సినిమా ఆ స్థాయిలో లేకపోతే మాత్రం విమర్శలపాలవ్వాల్సి వస్తుంది. గతంలో అజిత్ నటించిన 'వీరమ్' అనే తమిళ చిత్రాన్ని 'వీరుడొక్కడే' పేరుతో తెలుగులోకి డబ్ చేసి థియేట్రికల్ రిలీజ్ చేసారు. అయితే అదే సినిమాని పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' పేరుతో రీమేక్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి తోడు ఈ సినిమా తెలుగులో ప్లాప్ అయింది.

ఇప్పుడు చిరంజీవి కూడా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న 'లూసిఫర్' చిత్రాన్ని రీమేక్ చేసి 'గాడ్ ఫాదర్' గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందుకే తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఎదురైన చేదు అనుభవం.. అన్నయ్య కు ఎదురుకాకూడదని మెగా అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.

అయితే అంతమంది దర్శకులను కాదని మోహన్ రాజా చేతిలో ఈ మెగా ప్రాజెక్ట్ ని పెట్టాటంటే.. అతను స్క్రిప్ట్ లో ఏవో కొత్త అంశాలను జోడించి ఉంటారని భావించవచ్చు. చిరంజీవి మరియు రామ్ చరణ్ లను ఎగ్జైట్ చేసిన అంశాలే ఇప్పుడు జనాలను థియేటర్లకు రప్పించాల్సి ఉంటుంది. ప్రమోషనల్ కంటెంట్ తో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. మరి దసరా బాక్సాఫీస్ వద్ద 'గాడ్ ఫాదర్' ఏం చేస్తాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.