బాలయ్య సినిమాలో మెగా హీరోయిన్...?

Sat Jul 04 2020 19:01:43 GMT+0530 (IST)

Mega Heroine In Balayya Movie

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'బెజవాడ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి అమలాపాల్. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపునే తెచ్చుకుంది. మెగా హీరోలు రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లతో 'నాయక్' 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మెగా హీరోయిన్ అనిపించుకున్నా కూడా ఎందుకో కానీ చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. దీంతో తమిళ మళయాల ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది ఈ బ్యూటీ. తెలుగులో చివరగా నాని నటించిన 'జెండాపై కపిరాజు' సినిమాలో నటించిన అమలాపాల్ 'మేము' 'వి.ఐ.పి 2' 'ఆమె' వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం రెండు తమిళ ఒక మలయాళ ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకున్న అమలాపాల్ 'లస్ట్ స్టోరీస్' తెలుగు రీమేక్ లో నటిస్తుందని సమాచారం. అయితే ఇప్పుడు లేటెస్టుగా తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ అమలాపాల్ కొట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.కాగా సీనియర్ హీరో నందమూరి బాలయ్య సరసన అమలాపాల్ నటించనుందట. బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టే ఫస్ట్ లుక్ టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది. దీంతో ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా ఎవరు నటించబోతున్నారంటూ నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ కోసం వేట సాగించిన చిత్ర యూనిట్ చివరకి సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్న అమలాపాల్ ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అమలాపాల్ తో దీనికి సంభందించి డిస్కషన్స్ కూడా జరిగాయట. మరి ఈ వార్తల్లో నిజమెంత అని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.