చిన్ని కృష్ణ థూ.. మెగా ఫ్యాన్ ఫైర్

Mon Mar 25 2019 10:11:06 GMT+0530 (IST)

Mega Fans Fires on Chinni Krishna

ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ పలువురు సినీప్రముఖులు పార్టీలకు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అలీ - పోసాని - నాగబాబు - 30 ఇయర్స్ పృథ్వీ సహా పలువురు రాజకీయ పార్టీల్లో చేరి ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఆ క్రమంలోనే పరిశ్రమకు చెందిన పలువురు పెద్దల్ని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలకు అతీతంగా రాజకీయాల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగానూ టార్గెట్ చేయాల్సిన సన్నివేశం ఉంటుందని పలువురు సెలబ్రిటీల వ్యాఖ్యలు చెబుతున్నాయి. నిన్నటిరోజున టాలీవుడ్ సీనియర్ రైటర్ చిన్నికృష్ణ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. అత్యవసర మీడియా మీట్ అంటూ ఆయన నేరుగా జనసేనాని పవన్ కల్యాణ్ ని - మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యల్లో పర్సనల్ వ్యవహారాలు ఉన్నాయి. ``చిరుకి ఇండస్ట్రీ హిట్ కథను ఇచ్చాను. కనీసం రూ.10 రూపాయల పప్పన్నం కూడా పెట్టలేదని.. అలాంటి వారికి ఎందుకు సపోర్ట్ ఇవ్వాలని`` వారి సామాజికవర్గ ప్రజలు - ఓటర్లను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ``నేను నోరు తెరిస్తే పవన్ నవరంధ్రాలు మూసుకోవాల్పిందే. మీరు.. మీ కుటుంబం ఏ పార్టీతో చేతులు కలిపారో ఆ పార్టీ సభ్యులందరికి కూడా పేరు పేరున చెబుతున్నాను. నా నోరు తెరిపించే పనిచేయొద్దని హెచ్చరిస్తున్నాను`` అంటూ చిన్నికృష్ణ వ్యాఖ్యానించడం సంచలనమైంది. దీనికి మెగా ఫ్యాన్స్ అంతే ధీటుగా స్పందిస్తున్నారు.

టాలీవుడ్ రైటర్ గా ఉన్న తనకు ఉపాధినిచ్చిన మెగా ఫ్యామిలీ హీరోల పై అతడు ప్రశంసలు కురిపిస్తున్న ఓ ఈవెంట్ వీడియోని పోస్ట్ చేసి చిన్నికృష్ణ పై మెగా ఫ్యాన్ ఎస్.కె.ఎన్ ఓ రేంజులో ఫైరయ్యారు. ``అన్నం పెట్టిన చెయ్యి ని నరికే నమ్మక ద్రోహులు చాలా మంది ఉంటారు. గరళం మింగిన శివుడు ఎలాగో అన్నయ్య చిరంజీవి అలాగే. ఆయన స్పందించక పోవచ్చు కానీ ఆ కాశీ విశ్వనాధుడే నీ లాంటి వాళ్ళని దించుతాడు. చిన్ని కృష్ణ థూ ....!`` అంటూ చీవాట్లు వేసారు. అల్లు అర్జున్ బద్రీనాథ్ ఈవెంట్ లో వీడియో ఇది. బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు  లాంటి బ్లాక్ బస్టర్ కు కథ అందించిన చిన్నికృష్ణ మెగా ఫ్యామిలీ హీరోలకు ఇంద్ర - బద్రీనాథ్ వంటి  కథల్ని అందించాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు రూ.3000 రెంటు కట్టే ఇంట్లో ఉన్నప్పుడు అల్లు అరవింద్ రూ.10లక్షలు ఇచ్చి భారతదేశంలో ఎక్కడికి వెళ్లి అయినా కథ రాసుకుని రా అని ఆదుకున్నారని ఎంతో ఆవేదనగా చిన్నికృష్ణ ఆ వీడియోలో మాట్లాడడం కనిపించింది. మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చిన్నికృష్ణను చెడుగుడు ఆడేస్తున్నారు.