పర్సనల్ అంటూనే టీడీపీని టార్గెట్ చేసిన నాగబాబు...!

Fri May 29 2020 16:00:06 GMT+0530 (IST)

Mega Brother Nagababu Sensational Comments on TDP

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు - నందమూరి బాలకృష్ణ ఇష్యూ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల నుంచి బయటపడటం.. థియేటర్స్ రీ ఓపెన్.. షూటింగ్స్ ప్రారంభం లాంటి అంశాలపై చిరంజీవి నేతృత్వంలో పలువురు దర్శకనిర్మాతలంతా కలిసి ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్చలకు తనను పిలవలేదని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ''మీటింగులు జరిగాయి. నన్ను పిలిచారా? నన్ను ఏ మీటింగ్ కి పిలవలేదు.. తలసానితో కలిసి వాళ్ళు భూములు పంచుకుంటున్నారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి భయపడతాం.. వక్రీకరించేది ఏంటి... ఇది వాస్తవం'' అని ఘాటైన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. ''ఇండస్ట్రీ బాగు కోసం పని చేస్తున్నారు తప్ప భూములు పంచుకోవడానికి ఎవరూ వెళ్లలేదు. నాతో సహా చాలామందిని పిలవలేదు. భూములు పంచుకుంటున్నారని అనడం ఏంటి.. ఇండస్ట్రీపై మీకున్న గౌరవం ఇదేనా... మీరు జస్ట్ ఒక హీరో మాత్రమే.. మీరు చిత్రపరిశ్రమను మాత్రమే కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించారు. నోరు కంట్రోల్ లో పెట్టుకొని మాట్లాడాలి. మీ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని ఇండస్ట్రీకీ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికీ క్షమాపణలు చెప్పండి. అది మీ బాధ్యత. రియల్ ఎస్టేట్ భూముల గురించి చెప్పాలంటే ఏపీలో టీడీపీ హయాంలో జరిగిన భూ దందా గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది'' అని ఒక వీడియో రిలీజ్ చేసాడు. ''ఈ వీడియో నా సొంత బాధ్యతపై చేస్తున్నాను.. నా పర్సనల్'' అని చెప్పుకొచ్చాడు నాగబాబు.అయితే ఈ వీడియోలో నాగబాబు పర్సనల్ అంటూనే డైరెక్ట్ గా గత ప్రభుత్వం టీడీపీని విమర్శిస్తూ.. ఇప్పటి తెలంగాణ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వచ్చారు. ''రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడాలంటే ఒక్కసారి ఆంధ్రపదేశ్ కి వెళ్తే తెలుస్తుంది.. గత టీడీపీ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సామాన్యుల జీవితాలు సర్వనాశనం అయిపోయాయి.. మిమ్మల్ని మీ తెలుగుదేశం పార్టీని నమ్మి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయింది'' అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. దీనిపై నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంతో మీ తమ్ముడు జనసేన అధినేత కూడా కలిసి ఉన్నాడు కదా అని నెటిజన్స్ నాగబాబు మీద విమర్శలు చేస్తున్నారు. అంటే ఆ భూ దందాలో మీ బ్రదర్ కి కూడా వాటా ఉందని అంగీకరిస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నాగబాబు - బాలయ్యల మధ్య మాటల యుద్ధం ఇదేమీ మొదటిసారి కాదు. ఎన్నికల సమయంలో కూడా వీరిరువురూ పరస్పర వ్యాఖ్యలు చేసుకోవడం తెలిసిందే. మరి ఇప్పుడు వీరిద్దరి వ్యాఖ్యల వలన రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో చూడాలి.