రజనీని చూడగానే భోరున ఏడ్చేసిన మీనా

Thu Jun 30 2022 14:00:02 GMT+0530 (IST)

Meena cried when she saw Rajinikanth

తెలుగు ..  తమిళ భాషల్లో మీనాకి ప్ర్రత్యేకమైన గౌరవం ఉంది. ఈ రెండు భాషలకి చెందిన ప్రజలు తెరపై ఆమె చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు. మనకళ్ల ముందు పెరిగిన పిల్ల అనే ఆప్యాయత మీనా పట్ల అందరికీ ఉంది. గ్లామర్ పరంగా హద్దులు దాటకుండా .. నటనకి గల ప్రాధాన్యత తగ్గకుండా మీనా తన కెరియర్ ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన తీరును ప్రశంసించకుండా ఉండలేం. 'సీతారామయ్య గారి మనవరాలు'  సినిమా చూసిన వాళ్లు అలాంటి మనవరాలు తమకి ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నారు.చారెడేసి కళ్లతో తెలుగు దనాన్ని ఆవిష్కరించిన మీనా పట్ల గౌరవం ఉండటానికి కారణం .. ఆమె ఎంచుకున్న పాత్రలే. ఏ హీరోలతో కలిసి బాలనటిగా చేసిందో .. అదే హీరోల సరసన హీరోయిన్ గా చేసినవారిలో శ్రీదేవి తరువాత కనిపించేది మీనానే.

తెలుగు .. తమిళ భాషల్లోని సీనియర్ స్టార్ హీరోలందరితోను కలిసి నటించిన రికార్డు ఆమె సొంతం. అలాంటి మీనాకి విద్యాసాగర్ తో వివాహమైంది. చూడముచ్చటైన జంట అనే అంతా చెప్పుకున్నారు. వాళ్లిద్దరి అన్యోన్యతకు గుర్తుగా .. ఏకైన సంతానంగా 'నైనిక' కనిపిస్తుంది.

వెండితెరపై స్టార్ డమ్ చూసిన కొంతమంది కథానాయికలు మాత్రమే తమ దాంపత్యం విషయంలోను అభినందనలు అందుకున్నారు. అలాంటి జంటలలో మీనా దంపతులు కూడా ఉన్నారు.

పెళ్లి తరువాత తనకి నచ్చిన పాత్రలను మాత్రమే అడపా దడపా చేస్తూ ఇల్లాలి బాద్యతలకే ఆమె ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. అలాంటి మీనా ఇప్పుడు విద్యాసాగర్ ను కోల్పోయింది. ఆయన మరణం ఆమె అభిమానులను కలిచివేసింది. అలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు అంటూ అంతా కన్నీళ్లు పెడుతున్నారు. నిన్ననే ఆయన అంత్యక్రియలు జరిగాయి.  

నిన్న మీనాను ఓదార్చడానికి రజనీకాంత్ వెళ్లారు .. విద్యాసాగర్ భౌతికకాయం దగ్గర నివాళులు అర్పించారు.   మీనాను ఆమె చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన వారాయన. అందువలన ఆమె అంటే ఆయనకి ప్రత్యేకమైన అభిమానం. ఆయనను చూడగానే 'అంకుల్' అంటూ మీనా భోరున  ఏడ్చిందట. ఆ సమయంలో రజనీ కన్నీళ్లు పెట్టుకున్నారని అంటున్నారు. ఆమెను ఓదార్చడానికి వెళ్లినవారిలో విజయ్ కుమార్ .. శరత్ కుమార్ .. కేఎస్ రవికుమార్  తో పాటు లక్ష్మి .. సంగీత .. ఖుష్బూ .. స్నేహా .. రంభ తదితరులు ఉన్నారు.