Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి వివరాలు..

By:  Tupaki Desk   |   14 Sep 2021 8:31 AM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి వివరాలు..
X
టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న మాదకద్రవ్యాల వ్యవహారంలో మనీలాండరింగ్‌ కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్‌ - ఛార్మి కౌర్ - రకుల్‌ ప్రీత్ సింగ్ - నందు - రవితేజ - రానా దగ్గుబాటి లను విచారించిన ఈడీ అధికారులు వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఈ క్రమంలో నిన్న సోమవారం హీరో నవదీప్‌ తోపాటు ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్ విక్రమ్‌ ను ఈడీ ప్రశ్నించింది. అయితే వీరందరినీ డ్రగ్స్ విక్రేత కెల్విన్‌ మాస్కెరాన్స్ ఇచ్చిన సమాచారం మేరకే విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి కెల్విన్ మాస్కెరాన్స్ ఈడీ ఎదుట అప్రూవర్ గా మారాడని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇందులో నిజానిజాలు తెలియనప్పటికి కెల్విన్ లాప్ టాప్ లో ఉన్న సమాచారం - మొబైల్ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ ఆధారంగానే ఈడీ దర్యాప్తు జరుగుతోందని తెలుస్తోంది. కెల్విన్ సినీ రాజకీయ ప్రముఖులతో పాటుగా సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్స్ మరియు కొన్ని కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు మొత్తం కెల్విన్ చుట్టూనే తిరుగుతోంది.

2017లో డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు కెల్విన్ ను అరెస్ట్ చేసినప్పుడు అందరూ అతన్ని నైజీరియన్‌ గా భావించారు. అయితే అతను ఎప్పటి నుంచో హైదరాబాద్ లో ఉంటున్నాడని తర్వాత గుర్తించారు. అతని తల్లిదండ్రులు కర్ణాటకకు చెందినవారు కాగా.. చాలా కాలం క్రితం హైదరాబాద్‌ కు వచ్చి స్థిరపడ్డారని తెలుస్తోంది. కెల్విన్ తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ మరియు హిందీలతో పాటుగా పలు విదేశీ భాషలను అనర్గళంగా మాట్లాడతాడని తెలుస్తోంది. మొదటిసారి అతను అరెస్ట్ అయినప్పుడు ఓల్డ్ బోయిన్‌ పల్లిలోని ఓ పబ్‌ లో మ్యుజిషియన్ గా పనిచేసేవాడు.

ఇప్పుడు మనీలాండరింగ్ మరియు ఫెమా నిబంధనల ఉల్లంఘనల కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు.. ప్రధాన నిందితుడైన కెల్విన్ మాస్కెరాన్స్ తో సినీ ప్రముఖులకు ఉన్న సంబంధాల గురించి విచారిస్తున్నారు. బ్యాంక్ ఖాతాల స్టేటమెంట్స్ ని పరిశీలించి అనుమానాస్పద లావాదేవీలపై వివరణ తీసుకుంటున్నారు. వీరితో పాటుగా కెల్విన్ ని కూడా గంటల తరబడి విచారిస్తున్నారు. అతని బ్యాంక్ ఖాతాల్లోని సందేహాస్పద లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇక ఈ కేసులో సెప్టెంబర్ 15న ముమైత్‌ ఖాన్‌ - 17న తనీష్ - 22న తరుణ్‌ లను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.