Begin typing your search above and press return to search.

కోవిడ్ కి పోటీగా భారీ రిలీజ్ ల క‌ల్లోలం

By:  Tupaki Desk   |   23 Jan 2022 11:30 AM GMT
కోవిడ్ కి పోటీగా భారీ రిలీజ్ ల క‌ల్లోలం
X
కోవిడ్ క‌ల్లోలం రెండేళ్లుగా కొన‌సాగుతూనే ఉంది. భార‌త‌దేశం అంత‌టా క‌రోనా మూడో వేవ్ భ‌య‌పెడుతూనే ఉంది. సుదీర్ఘ క్రైసిస్ కార‌ణంగా చాలా రంగాలు బాగా దెబ్బ తిన‌గా.. ఇత‌ర రంగాల్ని మించి సినీరంగం పూర్తిగా దిగాలు అయిపోయింది. వినోదం కోసం జ‌నం థియేట‌ర్ల‌కు రావాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉంది. అయితే మూడో వేవ్ లో మ‌ర‌ణాల శాతం ఎక్కువ లేక‌పోవ‌డంతో భ‌యం కొంత త‌గ్గి జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. ఉత్త‌రాదితో పోలిస్తే సౌత్ లో వినోద‌రంగం కొంత బెట‌ర్ అనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆడియెన్ సినిమా వీక్ష‌ణ‌ను మానుకోవ‌డం లేద‌ని స్ప‌ష్ఠ‌మైన సంకేతం వెలువ‌డుతోంది.

అయితే 2021 ఆద్యంతం రిలీజ్ లు లేకుండా పోయాయి. ద‌స‌రా క్రిస్మ‌స్ సంక్రాంతి అంటూ వెయిటింగ్ లో ఉండిపోయిన సినిమాల‌న్నీ రిలీజ‌య్యేదెలా? అంటే.. ఇప్పుడు దీనికి డేట్లు ఫిక్స్ చేయాల్సిన స‌న్నివేశం ఉంది. ప్రతి వారం షెడ్యూల్ క్లిష్టంగా మారుతోంది. భారీ విడుదల‌ల కోసం ప్లానింగ్ సాగుతోంది. మూడవ వేవ్ కారణంగా అంత‌రాయం క‌ల‌గ‌డంతో వాయిదా ప‌డిన‌వ‌న్నీ ఒక‌టొక‌టిగా విడుద‌కు రెడీ అవుతున్నాయి.

ఫిబ్ర‌వ‌రి చివ‌రి నాటికి కోవిడ్ ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని భావిస్తున్నారు మేక‌ర్స్. అందువ‌ల్ల మార్చి నుంచి క్రేజీ సినిమాల‌ రిలీజ్ ల కోసం ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ ఆచార్య ఏప్రిల్ 1వ తేదీన విడుద‌ల కానుంది. RRR కోసం రెండు తేదీల్ని లాక్ చేశారు మేకర్స్. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల కావచ్చని ప్ర‌క‌టించారు. ఈ రెండు పెద్ద సినిమాల‌ను అనుస‌రించి త‌దుప‌రి రిలీజ్ తేదీల్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మహమ్మారి ఉధృతి తగ్గిన తర్వాత జనవరి నెలాఖరులోగానీ లేదా ఫిబ్రవరి మొదటి వారంలోగానీ కొత్త విడుదల తేదీలను ప్రకటించే యోచనలో టాలీవుడ్ మేక‌ర్స్ ఉన్నారు.

రవితేజ ఖిలాడి నిర్మాతలు ఫిబ్రవరి 11 న చిత్రాన్ని విడుదల చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. అలాగే వ‌రుస‌గా మూడు నాలుగు పాన్ ఇండియా చిత్రాలు క్యూలో ఉన్నాయి. వీటిలో ప్ర‌భాస్ రాధే శ్యామ్- ప‌వ‌న్ రానాల‌ భీమ్లా నాయక్- మ‌హేష్‌ సర్కారు వారి పాటన అత్యంత భారీగా విడుద‌ల కానున్నాయి. ఎఫ్ 3- గ‌ని- రామారావు ఆన్ డ్యూటీ ఇవ‌న్నీ విడుదలకు రెడీ అవుతుండ‌గా తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

అడివి శేష్ మేజర్ విడుదలను పాన్-ఇండియన్ విడుదల చేయవలసి ఉంది. ఈ సినిమాని తెలుగు-త‌మిళం-హిందీ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని తెర‌కెక్కించారు. అలాగే వీట‌న్న‌టి న‌డుమా య‌ష్ న‌టించిన కేజీఎఫ్ 2 స‌మ్మ‌ర్ కి వ‌స్తోంది. ఈ వేస‌వికి ఫుల్ గా సినిమాలు విడుద‌ల కానున్నాయ‌ని స‌న్నివేశం చెబుతోంది.

ఏప్రిల్ 14 న‌ మూడు భారీ చిత్రాలు

ఏప్రిల్ 2022 సంథింగ్ స్పెష‌ల్ కానుంది. ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతూ మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలు ఏప్రిల్ 14న విడుద‌ల‌వుతున్నాయి. ఆ డేట్ ని లాక్ చేసామ‌ని మూడు టీమ్ లు అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు అభిమానుల్లో ఉల్లాసం క‌నిపిస్తోంది. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన `లాల్ సింగ్ చ‌ద్దా` రిలీజ్ డేట్ మారుతుంద‌ని ప్ర‌చారం సాగినా కానీ.. య‌థాత‌థంగా ప్ర‌క‌టించిన తేదీకే విడుద‌ల చేస్తున్నామ‌ని అమీర్ ఖాన్ తాజాగా స్ప‌ష్ఠం చేశారు. ఇక రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన కేజీఎఫ్ 2 ని ఏప్రిల్ 14న విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ ఇద్ద‌రితో పాటు ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన `బీస్ట్` అదే డేట్ కి అత్యంత భారీగా విడుద‌ల కానుంది. నిజానికి కేజీఎఫ్ 2.. బీస్ట్ చిత్రాలు ప‌లుమార్లు రిలీజ్ తేదీల‌ను మార్చుకున్న‌వే. సంక్రాంతికే రావాల్సిన బీస్ట్ ఓమిక్రాన్ ప్ర‌భావంతో వాయిదా ప‌డింది. కేజీఎఫ్ గ‌త స‌మ్మ‌ర్ అనుకున్నారు. కానీ ఆ త‌ర్వాత ద‌స‌రా అన్నారు. ఏడాది చివ‌రిలో అయినా వ‌స్తుంద‌ని ప్ర‌చారం సాగింది. కానీ ఏదీ సాధ్య‌ప‌డ‌లేదు. సంక్రాంతి బ‌రిలో ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రం ఉండ‌డంతో కేజీఎఫ్ 2ని వాయిదా వేసుకున్నార‌ని ప్ర‌చార‌మైంది. ఏది ఏమైనా ఇప్పుడు ఏప్రిల్ 14 తేదీకే రావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ మూడు చిత్రాల‌పై ఎంత త‌క్కువ‌గా చూసుకున్నా వెయ్యి కోట్ల మేర బెట్టింగ్ ఉంటుంద‌ని ప్రచార‌మ‌వుతోంది. అమీర్ -చైత‌న్య‌ల లాల్ సింగ్ చ‌ద్దా.. హిందీతో పాటు తెలుగులోను విడుద‌ల‌య్యే వీలుంది. అలాగే బీస్ట్ ని తమిళం-తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌నున్నారు. కేజీఎఫ్ 2 ఇటు సౌత్ అటు నార్త్ రెండు చోట్లా విడుద‌ల‌వుతుంది. ఇత‌ర సినిమాల్ని డామినేట్ చేసేంత క్రేజుతో కేజీఎఫ్ 2 విడుద‌ల‌వుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే హిందీ నాట ఈ మూవీకి థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్త‌డం ఖాయంగా చెబుతున్నారు. అమీర్ ఖాన్ కోసం ఎగ్జిబిట‌ర్లు ప్రైమ్ ఏరియాల థియేట‌ర్ల‌ను అప్ప‌గించే వీలుంది.

లాల్ సింగ్ తెలుగులోనూ?

అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 14 న థియేటర్లలోకి వస్తుందని సినిమా విడుదల తేదీలో మార్పు గురించి ఊహాగానాలు తోసిపుచ్చుతూ మేకర్స్ శుక్రవారం తెలిపారు. లాల్ సింగ్ చద్దా వాయిదా పడిందని ఆగస్ట్ 11న విడుదల కావచ్చని వారం ముందు వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ కి స్వస్తి పలుకుతూ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని చిత్ర బ్యానర్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ చిత్రం 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్ కి అధికారిక రీమేక్. ఇందులో టామ్ హాంక్స్ నటించారు. హిందీ వెర్షన్ ను అతుల్ కులకర్ణి నిర్మిస్తున్నారు. 2017 డ్రామా `సీక్రెట్ సూపర్ స్టార్‌`కి దర్శకత్వం వహించిన అద్వైత్ చందన్ దీనికి దర్శకత్వం వహించారు. లాల్ సింగ్ చద్దా లో కరీనా కపూర్ ఖాన్- మోనా సింగ్ న‌టించారు. టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఈ చిత్రంతోనే హిందీ ప‌రిశ్ర‌మ‌కు పరిచ‌యం అవుతున్నారు.