Begin typing your search above and press return to search.

103 థియేటర్లలో 'అఖండ' 50 రోజుల పండగ!

By:  Tupaki Desk   |   20 Jan 2022 7:43 AM GMT
103 థియేటర్లలో అఖండ 50 రోజుల పండగ!
X
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి ఒక సినిమా చేస్తున్నాడనే టాక్ రాగానే, అందరిలో ఆసక్తి పెరిగింది. ఎందుకంటే అంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు రెండూ కూడా బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిలించివేశాయి. అంతేకాదు .. లుక్ పరంగా అంతకుముందు చూడని బాలకృష్ణని ఆ రెండు సినిమాల్లో బోయపాటి చూపించాడు. లుక్ పరంగా .. వసూళ్ల పరంగా .. ఎక్కువ రోజులు ఆడిన సినిమాలుగా అవి బాలకృష్ణ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచాయి. దాంతో మూడో సినిమా ఎలా ఉంటుందా అనే ఆత్రుత అభిమానుల్లో పెరిగింది.

ఈ నేపథ్యంలోనే 'అఖండ'ను టైటిల్ గా ఫిక్స్ చేశారు. బాలకృష్ణ క్రేజ్ కి తగినట్టుగానే మంచి పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. మరి ఆయనను అఘోరా'గా ఎలా చూపిస్తాడు? అనేది అందరిలో కుతూహలాన్ని పెంచుతూ వెళ్లింది. అఘోర లుక్ బయటికి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై అమాంతంగా అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. అలా సినిమా విడుదలయ్యే సమయానికి ఆ అంచనాలు ఒక రేంజ్ కి తీసుకుని వెళ్లడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు. మాస్ యాక్షన్ కి దైవత్వాన్ని జోడించి 'అఖండ'ను థియేటర్లకు తీసుకుని వచ్చాడు.

డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుతున్న ఈ సినిమా, థియేటర్లను దడదడలాడించేసింది. చాలా కాలం తరువాత థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపించేలా చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేయడం విశేషం. సంక్రాంతి పండుగ రోజులలోను ఈ సినిమా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తానికి బాలకృష్ణ సంక్రాంతి ముచ్చటను కూడా ఈ సినిమా తీర్చేసింది.

ఈ రోజుతో ఈ సినిమా 50 రోజులను పూర్తిచేసుకుంది. ఒకటో రెండో థియేటర్లలో కాదు, ఏకంగా 103 థియేటర్లలో 50 రోజుల పండుగను జరుపుకుంటోంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండులో ఒక సినిమా వారం రోజుల పాటు థియేటర్లలో నిలబడటమే కష్టమైపోయింది. అలాంటిది ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమాతో బాలయ్య - బోయపాటిలకు హ్యాట్రిక్ హిట్ పడటం మరో విశేషం. బలమైన కథాకథనాలు .. అఘోరాగా బాలయ్య నటన .. బోయపాటి టేకింగ్ .. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఈ స్థాయి హిట్ దక్కడానికి కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.