ప్రభాస్ తో చేయబోయే సినిమాపై ఫుల్ క్లారిటీ ఉంది: మారుతి

Tue Jun 28 2022 17:00:01 GMT+0530 (IST)

Maruti with prabhas movie news

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శకుడు మారుతి దాసరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మారుతీ కూడా ఈ సినిమాపై క్లారిటీ ఇవ్వడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ గురించి అనేక ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.ప్రభాస్ చిత్రానికి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారని.. ఇది మారుతి మార్క్ హారర్ కామెడీ థ్రిల్లర్ అని వినిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా రొమాన్స్ పాళ్లు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమాకి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తానని మారుతి తెలిపారు.

'పక్కా కమర్షియల్' ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన మారుతి.. ఈ సినిమా విడుదలైన 20 రోజుల తర్వాత తన కొత్త సినిమాపై స్పష్టత వస్తుందని.. ప్రభాస్ తో ఏ తరహా సినిమా చేస్తున్నాననే విషయంలో దయచేసి ఎలాంటి పుకార్లను నమ్మవద్దని అన్నారు.

ప్రభాస్ కు ఎలాంటి కథ అయితే బాగుంటుందనే విషయంలో తనకు ఫుల్ క్లారిటీ ఉందని.. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. ఈ మూవీ ఏ జోనర్ మరియు టైటిల్ గురించి ఇప్పుడే మాట్లాడదలుచుకోలేదు అని మారుతి చెప్పుకొచ్చారు.

ఆ మధ్య మారుతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ప్రభాస్ సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయి. ఆయనుకు నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలనుంది. డార్లింగ్ - బుజ్జిగాడు లాంటి యాక్టివ్ ప్రభాస్ ను మళ్లీ చూపించాలనేదే నా కోరిక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేయను'' అని చెప్పారు.

ఇకపోతే ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ ను ఆగస్ట్ నెలాఖరున లేదా సెప్టెంబర్ మొదటి వారంలో సెట్స్ మీదకు తీసుకొస్తారని సమాచారం. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం 'సలార్' 'ఆది పురుష్' 'ప్రాజెక్ట్ K' వంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదే క్రమంలో 'స్పిరిట్' అనే మూవీ పట్టాలెక్కనుంది.