మారుతి తెలివే తెలివబ్బా..

Wed Dec 04 2019 21:36:34 GMT+0530 (IST)

Maruti is smart

నిజ జీవిత పాత్రల్ని పరిణామాల్ని సినిమాల్లో వినోదం కోసం భలేగా వాడుకునే దర్శకుడిగా శ్రీను వైట్లకు పేరుండేది. తన సినిమాల్లో చాలామంది ఫిలిం సెలబ్రెటీల్ని మాకరీ చేస్తూ కామెడీ పండించాడాయన. కానీ తర్వాత ఫామ్ కోల్పోవడంతో ఇలాంటివి ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. తన మీద ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పిస్తూ ఒక కవిత చెబితే.. దాన్ని కూడా ఆగడు సినిమాలో విలన్ పాత్రకు డైలాగ్‌గా వాడేసిన ఘనుడు వైట్ల. కానీ అది వర్కవుట్ కాలేదు. ఐతే ఈ తరంలో ఇలా ట్రెండీగా కామెడీ పండించే దర్శకుడిగా మారుతి పేరు చెప్పుకోవాలి. అతడి కథలు పాత్రలు కామెడీ కంటెంపరరీగా ఉండి ఈ తరం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి.ఈ తరం ప్రేక్షకులకు బాగా కనెక్టయ్యేలా సినిమాలు తీస్తాడు కాబట్టే మారుతి సక్సెస్ రేట్ బాగుంది. అతడి కొత్త సినిమా ప్రతి రోజూ పండగే కథాంశం పాతగానే అనిపించినా.. ట్రీట్మెంట్ మాత్రం ట్రెండీగా అనిపించింది. ప్రస్తుతం టిక్ టాక్ ప్రభంజనాన్ని దృష్టిలో ఉంచుకుని హీరోయిన్ పాత్రను టిక్ టాక్ సెలబ్రెటీగా పెట్టడం మారుతి ముద్రను సూచిస్తుంది. ఆరు వారాల్లో చనిపోబోయే వ్యక్తి కోసం అతడి పిల్లలు మనవళ్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన అంతిమ కోర్కెలన్నీ తీర్చి ప్రశాంతంగా చనిపోయేలా చేయడం అన్నది ఈ సినిమా కాన్సెప్ట్.  వినడానికి విషాదభరితమైన కాన్సెప్ట్‌లా అనిపించినా.. దాన్ని చాలా ఫన్నీగా డీల్ చేశాడు మారుతి. దీని మీద జోకులు భలేగా పేలాయి. ఇక ట్రైలర్ అంతా చూశాక ఇది మరో శతమానం భవతిలాగా ఉందే అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. దీని గురించి కంప్లైంట్ రాకుండా ఆ సినిమా ప్రస్తావనతో ట్రైలర్‌ను ముగించడం కొసమెరుపు. ఇది చూశాక మారుతి తెలివే తెలివి అనకుండా ఉండలేరు ఎవ్వరూ.