ప్రభాస్ తో సినిమా నాటుకోడి పులుసులా ఉంటది!

Mon Jun 27 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Maruthi Upcoming Movie with Prabhas

మారుతి కథలు ఓ మాదిరి బడ్జెట్ కి లోబడి నడుస్తాయి .. ఒక రకంగా చెప్పాలంటే ఆయనవి మద్యతరగతి కథలు. ఫారిన్  రోడ్లపై పరిగెడుతూ అవి ఆయాసపడవు. ఆయన  కథల్లోని తెలుగుదనం వలన ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అవుతారు. 'భలే భలే మగాడివోయ్'  .. 'మహానుభావుడు' .. ' ప్రతిరోజూ పండగే' సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. పాత్రలు .. సన్నివేశాలు వాస్తవికతకు దగ్గరగా ఉండటం వలన ఇది మన మధ్య జరిగే కథ అని ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. ఆయన సినిమాల్లో లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ఇవన్నీ ఉంటాయి.ఆయన తాజా చిత్రంగా రూపొందిన ' పక్కా కమర్షియల్' సినిమా వచ్చేనెల 1వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో మారుతి బిజీగా ఉన్నాడు. ప్రభాస్ తోను ఆయన ఒక సినిమా చేయనున్నాడనే  టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. హారర్ థ్రిల్లర్ టచ్ తో ఈ కథ నడుస్తుందని కొందరంటే మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ అని మరికొందరు చెబుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో మారుతికి ఈ ప్రాజెక్టును గురించిన ప్రశ్ననే ఎదురైంది.

అందుకు మారుతి స్పందిస్తూ ..  ప్రభాస్ తో నేను చేయనున్న సినిమా అలా ఉంటుందనీ .. ఇలా ఉంటుందని అంటున్నారు. ఫలానా జోనర్లో ఉంటుందని వాళ్లే చెప్పేస్తున్నారు. ఇలా ఇంకొంతకాలం పోతే సినిమా కూడా వాళ్లే తీసేలా ఉన్నారు. ప్రభాస్ సినిమాపై వచ్చే సినిమాను గురించి ..

దాని జోనర్ గురించి నేను ఒకటే మాట చెబుతున్నాను . నాకు నాటుకోడి పులుసు వండటం బాగా తెలుసుననుకోండి .. అది ఇష్టపడేవాళ్లు నాతో అదే వండిస్తారు. కానీ మనం అది మానేసి చైనీస్ వంట చేయడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది?

నాకు తెలిసిన దానిని నేను మానుకుని .. పక్కదానికి వెళితే అలా ఉంటుంది. ఎప్పుడైనా మనకి బాగా తెలిసిన పని .. మనం బాగా చేయగలిగిన పనిని చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. ప్రస్తుతం నేను చేసేది అదే" అంటూ చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి ఈ సినిమా తన మార్క్ లోనే ..

ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. ఇక మారుతితో  తాను ఒక సినిమా చేయనున్నట్టు నిన్న 'పక్కా కమర్షియల్'  ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పై చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. ఇటు గీతా ఆర్ట్స్ .. అటు యూవీ వారితో ఉన్న సాన్నిహిత్యం మారుతిని మరోస్థాయికి తీసుకువెళుతోందని తెలియడం లేదూ!