Begin typing your search above and press return to search.

నేను ఫస్టు టైమ్ యాక్షన్ చెప్పిందే మెగాస్టార్ కి: మారుతి

By:  Tupaki Desk   |   27 Jun 2022 4:07 AM GMT
నేను ఫస్టు టైమ్ యాక్షన్ చెప్పిందే మెగాస్టార్ కి: మారుతి
X
మొదటి నుంచి కూడా మారుతికి గీతా ఆర్ట్స్ తోను .. యూవీ క్రియేషన్స్ వారితోను మంచి అనుబంధం ఉంది. ఈ రెండు బ్యానర్లకు వేరు వేరుగా మారుతి తీసిపెట్టిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు బ్యానర్లు కలిసి ఆయన దర్శకత్వంలో ఒక సినిమా చేశాయి .. ఆ సినిమా పేరే 'పక్కా కమర్షియల్'. గోపీచంద్ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వచ్చేనెల 1వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి మాట్లాడాడు.

"ఈ రోజు నాకు చాలా ఎమోషనల్ డే. బందరులో చిరంజీవిగారి బొమ్మలు వేసుకుంటూ .. బ్యానర్లను రాసుకుంటూ ఉండే నేను ఇక్కడివరకూ వచ్చాను. నా సినిమాకి చిరంజీవిగారు గెస్టుగా వచ్చే వరకూ జర్నీ చేశాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

నేను బందరులో ఉన్నప్పుడే చిరంజీవి గారంటే పిచ్చి ఉండేది. అప్పట్లోనే నేను చిరంజీవి గారితో కలిసి ఏదో మాట్లాడుతూ ఉన్నట్టుగా కల వచ్చింది. చిరంజీవి గారు 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు నా కల నిజమైంది. అప్పుడు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు.

నేను సినిమాల్లోకి రావడానికి ముందు .. డైరెక్టర్ ను కావడానికి ముందు, 'ప్రజారాజ్యం' పార్టీ కోసం చిరంజీవి గారితో ఒక యాడ్ చేయవలసి వచ్చింది. అప్పడు ఆయనకి 'యాక్షన్' చెప్పాను . నేను ఫస్టు టైమ్ యాక్షన్ చెప్పిందే చిరంజీవిగారికి .. ఇలాంటి ఒక అదృష్టం ఎవరికీ ఉండదు. అసలు నేను డైరెక్టర్ ను కావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ 'నీలో ఒక డైరెక్టర్ ఉన్నాడయ్యా ట్రై చేయి' అని చిరంజీవి అన్నారు. ఆయనన్న మాటను నిజం చేయాలనే ఉద్దేశంతో అడుగు ముందుకు వేశాను. ఆ తరువాత విషయాలు మీకు తెలుసు.

చిరంజీవిగారు ఒక స్టార్ అనే మీరు అనుకుంటారు .. ఆయనలాంటి హ్యూమన్ బీయింగ్ ను మీరు ఎక్కడా చూడలేరు. ఈ రోజుల్లో చిన్న చిన్న హీరోలను కలవడమే చాలా కష్టం. అలాంటిది చిరంజీవిగారిని మీరు తలచుకోండి ఆయన కనిపిస్తారు.

చిన్న చిన్న వాళ్ల కోసం కూడా ఆయన తన సమయాన్ని వెచ్చించి ఫంక్షన్స్ కి వస్తున్నారు. అందుకు నిజంగానే ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా నాకు గోపీచంద్ అనే ఫ్రెండ్ ను ఇచ్చింది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.