Begin typing your search above and press return to search.

రజనీకి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ అలా వచ్చింది: మనో

By:  Tupaki Desk   |   15 Sep 2021 4:34 AM GMT
రజనీకి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ అలా వచ్చింది: మనో
X
మనో మంచి సింగర్ .. మంచి సమయస్ఫూర్తి ఉన్న యాంకర్. సరదాగా పాత్రల్లో ఒదిగిపోయే నటుడు .. అంతకు మించిన డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇలా మనో ఆల్ రౌండర్ అనిపించుకున్నారు. ఏ పని చేసినా అందులో తనదైన ముద్ర వేయడం ఆయన ప్రత్యేకత. అయితే మనో ఏదో ఒక పాటల ప్రోగ్రామ్ లో పాడేసి, ఆ తరువాత వెంటనే సినిమాల్లో అవకాశాలను దక్కించుకోలేదు. సింగర్ కావడానికి ఆయన ఎంతో కాలం ఎదురుచూశారు. సరైన సమయం వచ్చేవరకూ వినయంతో తనకి అప్పగించిన పనులు చేస్తూ వెళ్లారు.

కొంతకాలం పాటు ఎమ్మెస్ విశ్వనాథన్ దగ్గర పనిచేసిన మనో, ఆయన ప్రియ శిష్యుడిగా మారిపోయారు. ఆ తరువాత ఆయన అనుమతితోనే చక్రవర్తిగారి దగ్గర చేరారు. అక్కడే ఆయన భవిష్యత్తు ఆశాజనకంగా మారింది. చక్రవర్తి దగ్గర పనిచేస్తున్నప్పుడే బాలూతో మనోకి పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరూ కలిసి తెలుగు .. తమిళ భాషల్లో కొన్ని పాటలు పాడారు. బాలు వాయిస్ కి దగ్గరగా మనో వాయిస్ ఉంటుందని అంతా చెప్పుకునేవారు.

అలాంటి మనో ఆ తరువాత కాలంలో ఒక వైపున గాయకుడిగా .. మరో వైపున డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. రజనీకాంత్ సినిమా అంటే ఇప్పుడు మనో చెప్పవలసిందే. తనకి రజనీకాంత్ సినిమాకి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ ఎలా వచ్చిందనే విషయాన్ని తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మనో చెప్పుకొచ్చారు. "రజనీకాంత్ గారికి సాయికుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారు. 'ముత్తు' సినిమాకి కూడా ఆయనతోనే డబ్బింగ్ చెప్పించాలని ట్రై చేస్తున్నారు. అప్పట్లో హీరోగా ఆయన కన్నడ సినిమాలతో బిజిగా ఉన్నారు. 'ముత్తు' సినిమా రిలీజ్ డేట్ చెప్పేయడం వలన టెన్షన్ అయింది.

ఆ సినిమా వారు నన్ను కలిశారు .. ఇంటెర్వెల్ సీన్ .. క్లైమాక్స్ సీన్ ఈ రెండింటికీ మీరు డబ్బింగ్ చెప్పండి. ఆ రెండు సీన్స్ ను రజనీకాంత్ కి చూపిస్తాము .. ఆయన ఓకే అంటే ఈ సినిమాకి మీరే డబ్బింగ్ చెబుదురుగాని అన్నారు. రజనీ పాత్రకి డబ్బింగ్ చెప్పే అవకాశం రావడమంటే మాటలా? ఓకే అయినా .. కాకపోయినా చెప్పేద్దాం అనేసి జాలీగా వెళ్లి చెప్పేశాను. మరుసటి రోజు వాళ్లు కాల్ చేశారు. "మీ వాయిస్ విని రజనీకాంత్ గారు హ్యాపీగా ఫీలయ్యారు .. మిమ్మల్ని కంటిన్యూ చేయమన్నారు" అని చెప్పారు.

ఆ తరువాత కొంతకాలానికి ఒక రోజు రాత్రి .. రజనీకాంత్ గారు కాల్ చేశారు. 'నేను రజనీకాంత్ .. ' అన్నారు. నా స్నేహితులంతా కమెడియన్స్ .. వాళ్లు మిమిక్రీ చేస్తున్నారనుకుని, 'ఏ రజనీకాంత్ ?' అన్నాను. దాంతో మరోసారి ఆయన తన పేరు చెప్పారు. అప్పుడు నేను గుర్తుపట్టేసి సారీ చెప్పాను. నా స్నేహితులు నన్ను ఆటపట్టించడం కోసం అలా మాట్లాడుతున్నారేమోనని అనుకున్నన్నానని అంటే ఆయన నవ్వేశారు. ఆ తరువాత 'చంద్రముఖి' సినిమాకి చాలా బాగా డబ్బింగ్ చెప్పావంటూ అభినందించారు" అని చెప్పుకొచ్చాడు.