సంతకం పెట్టించుకున్నాక కమిట్ మెంట్ అడిగేవారట!

Sun Dec 08 2019 12:27:58 GMT+0530 (IST)

Manjari Phadnis Sensational Comments on FilmMakers

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని ఎవరూ చెప్పరు. కానీ.. ఉందని చెప్పేవారు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తారు. అందానికి అందం.. అంతకు మించిన అభినయం ఉండి కూడా అవకాశాలు చేజిక్కించుకోలేక.. రెండు మూడు సినిమాలతో ప్యాకప్ అయ్యేటోళ్లు చాలామందే కనిపిస్తారు.

ఎందుకిలా? అని అడిగేవారుండరు. ఫలానా కారణంతోనే తామిలా తెరమరుగు కావాల్సి వస్తోందన్న మాటను చెప్పే సెలబ్రిటీలు తక్కువగా కనిపిస్తారు. ఏదో మాటల మధ్యలోనో.. మనసు విరిగిపోయిన వేళలో ఎవరైనా ప్రత్యేక ఇంటర్వ్యూ అన్నప్పుడు తమకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజాలు కక్కేసే నటీమణులు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.తాజాగా ఆ కోవలోకే వస్తారు నటి మంజరి ఫడ్నిస్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చాలానే ఉందన్న విషయాన్ని ఆమె చెప్పేశారు. గతంలోనూ ఈ ఇష్యూ మీద ఓపెన్ గా మాట్లాడిన ఆమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

కొందరు తనకు అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి.. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని..అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కోరిక తీర్చాలన్న విషయాన్ని తీరిగ్గా బయటపెట్టేవారన్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడల్లా తనకు ఇచ్చిన అడ్వాన్స్ ను తాను తిరిగి ఇచ్చేశానన్నారు. ఈ కారణంతోనే తాను ఎక్కువకాలం సినిమాల్లో కొనసాగలేకపోయిన విషయాన్ని చెప్పారు.

తాను ఎక్కువ సినిమాలు చేయకపోవటానికి.. చిన్న సినిమాలు చేయటానికి కారణం ఇదేనంటూ కుండ బద్ధలు కొట్టేశారు. క్యాస్టింగ్ కౌచ్ అంశంతో పాటు తన సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టటం కూడా తన కెరీర్ మీద ప్రభావాన్ని చూపించినట్లు ఒప్పుకోవటం గమనార్హం. ఆత్మాభిమానం కోల్పోలేక ఎందరో సినిమాల్ని తాను రిజెక్టు చేశానని చెప్పారు. బెడ్రూంకు ఓకే అంటే తప్ప అవకాశాలు రాని పరిస్థితి ఉందని ఆరోపించింది. ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేసిన మంజరి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.