ఫుల్ ఫామ్ లో ఉన్న మణిశర్మ తనయుడు మహతి..!

Thu Sep 16 2021 06:00:01 GMT+0530 (IST)

Manisharma son Mahathi in full form

టాలీవుడ్ లో ప్రస్తుతం కీరవాణి - మణిశర్మ - దేవిశ్రీప్రసాద్ - ఎస్.ఎస్ థమన్ వంటి సంగీత దర్శకులు జోరు చూపిస్తుంటే.. మరోవైపు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ వరుస అవకాశాలతో వారికి పోటీగా దూసుకుపోతున్నాడు. చిన్న మీడియం రేంజ్ సినిమాలకు ఏకైక ఛాయిస్ గా మారిన మహతి.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నాడు.మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడే మహతి స్వర సాగర్. ఇంతకముందు 'ఛలో' 'భీష్మ' 'అశ్వద్ధామ' 'ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ' వంటి సినిమాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించి మంచి పేరు తెచ్చుకున్నాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మణిశర్మ వర్క్ చేసే సినిమాలన్నింటికీ కొడుకు మహతి సహకారం కూడా ఉంటుందనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చేతిలో ఏడెనిమిది ప్రాజెక్ట్స్ పెట్టుకొని మహతి స్వర సాగర్ ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. ఇప్పటికే నితిన్ హీరోగా రూపొందిన 'మాస్ట్రో' సినిమాకి చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించాడు. ఈ నెల 17న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ 'మాచర్ల నియోజకవర్గం' చిత్రానికి కూడా మహతినే సంగీతం సమకూరుస్తున్నాడు. ఇది నితిన్ తో యువ సంగీత దర్శకుడు వర్క్ చేసే నాలుగో సినిమా అవుతుంది.

అలానే మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న 'కిన్నెరసాని' చిత్రానికి మహతి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ కు అందించిన నేపథ్య సంగీతం విశేషంగా అలరించింది. బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమవుతున్న 'స్వాతిముత్యం' సినిమాతో పాటుగా.. మంచు విష్ణు - శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న 'డీ & డీ' చిత్రానికీ స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో వస్తున్న '5Ws' సినిమా కూడా ఆయన చేతిలోనే ఉంది.

ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేష్ కాంబినేషన్ లో రూపొందే 'భోళా శంకర్' చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశం మహతి సాగర్ దక్కించుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు చిన్న మీడియం రేంజ్ సినిమాలే చేసిన మహతి కి.. ఇది మెగా ఛాన్స్ అనే చెప్పాలి. చిరు కు మణిశర్మ ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ఇప్పుడు మణి తనయుడు చిరంజీవి చిత్రానికి ఎలాంటి సాంగ్స్ ఇస్తాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. 'భోళా శంకర్' అనౌన్స్ మెంట్ వీడియోకి అందించిన బీజీఎమ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాతో మహతి సాగర్.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జాబితాలోకి చేరుతాడేమో చూడాలి.