Begin typing your search above and press return to search.

మంచు విష్ణు ప్యానెల్లో ఆమెను చూసి షాక్

By:  Tupaki Desk   |   24 Sep 2021 2:30 AM GMT
మంచు విష్ణు ప్యానెల్లో ఆమెను చూసి షాక్
X
మొత్తానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేయబోతున్న మంచు విష్ణు ప్యానెల్ మీద స్పష్టత వచ్చేసింది. ఎన్నికలకు రెండు వారాల ముంగిట తన ప్యానెల్‌ను ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించాడు విష్ణు. ముందు ప్రచారం జరిగినట్లే సీనియర్ నటుడు రఘుబాబు ఈ ప్యానెల్ నుంచి కార్యదర్శిగా పోటీ చేస్తుండగా.. బాబూ మోహన్, పృథ్వీ, మాదాల రవి ఉపాధ్యక్ష పదవులకు బరిలో నిలవబోతున్నారు. శివ బాలాజీ కోశాధికారిగా.. కరాటె కళ్యాణి, గౌతమ్ రాజు సంయుక్త కార్యదర్శుల పదవులకు పోటీ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులతో పోలిస్తే మంచు విష్ణు మరీ ప్రముఖులను, పెద్ద స్థాయి వాళ్లను బరిలో నిలపట్లేదు. కానీ 'మా' సభ్యులతో సాన్నిహిత్యం ఉన్న వాళ్లనే తెలివిగా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పోటీ చేస్తున్న వాళ్లలో ఒక పేరు అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ పేరే.. రేఖ.

'ఆనందం' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి.. కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో పాగా వేసిన కన్నడ అమ్మాయి రేఖ. ఐతే తొలి సినిమా ఇచ్చిన విజయాన్ని ఆమె అంతగా ఉపయోగించుకోలేదు. సరైన సినిమాలను ఎంచుకోలేక త్వరగానే కనుమరుగైపోయింది. టాలీవుడ్లో ఆమె కెరీర్ ముగిసిపోయి పుష్కరం దాటిపోయింది. రవికృష్ణ సరసన నటించిన 'నిన్న నేడు రేపు'నే ఆమె చివరి సినిమా. అప్పటికే ఆమె ఫేడవుట్ అయిపోయింది. తర్వాత ఆమెను ఎవరూ పట్టించుకోలేదు.

దశాబ్దంన్నర నుంచి అసలామె హైదరాబాద్‌లోనే లేదు. బెంగళూరుకే పరిమితమైంది. ఐతే ఇక్కడ యాక్టివ్‌గా ఉన్నపుడు 'మా' సభ్యత్వం తీసుకున్న ఆమె.. ఇన్నేళ్ల తర్వాత ఇలా 'మా' ఎన్నికల్లో ఈసీ సభ్యురాలిగా పోటీకి సై అనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓవైపు కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నపుడు అదే రాష్ట్రానికి చెందిన రేఖ ఈసీ మెంబర్‌లో పోటీ చేయడంలో తప్పేముందన్న ఉద్దేశంతో కావాలనే ఆమెను పోటీకి నిలబెట్టినట్లున్నారు. కానీ ప్రకాష్ రాజ్‌కు ఇక్కడున్న పాపులారిటీ ఏంటి.. ఆయన్ని మన వాళ్లు ఎంతగా ఓన్ చేసుకుంటారన్నది చూడాలి. మరి రేఖను ఇక్కడి వాళ్లు ఎలా చూస్తారో చెప్పేదేముంది?