Begin typing your search above and press return to search.

'మా' బైలాస్ మారుస్తాం.. కానీ: మంచు విష్ణు కీలక ప్రకటన..!

By:  Tupaki Desk   |   18 Oct 2021 9:46 AM GMT
మా బైలాస్ మారుస్తాం.. కానీ: మంచు విష్ణు కీలక ప్రకటన..!
X
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ మీద గెలుపొంది.. 'మా' అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు విష్ణు. పదవీ బాధ్యతలు చేపట్టిన విష్ణు.. తన ప్యానల్ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న మంచు విష్ణు.. శ్రీ విద్యానికేతన్‌ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చాలా విషయాల్లో అసోసియేషన్‌ లోని బైలాస్‌ మార్చాలనుకుంటున్నానని విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

''నేను చాలా విషయాల్లో 'మా' అసోసియేషన్ బైలాస్ మార్చాలనుకుంటున్నాను. అది కూడా సినీ పెద్దలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాను. ప్రధానంగా మెంబర్ షిప్ ని స్ట్రిక్ట్ గా చేయాలని అనుకుంటున్నాను. ఎవరంటే వాళ్లు ‘మా’ సభ్యులు సభ్యులు కాకూడదని నేను భావిస్తున్నాను. మిగతా ఇండస్ట్రీలలోని అసోసియేషన్ బైలాస్ ని స్టడీ చేసి మన తెలుగు నటులకు 'మా' వాతావరణానికి ఏది బాగుంటుందో ఆ అంశాలను తీసుకుంటాం. వాటిని పెద్దల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సలహాలతో.. అందరూ ఓకే అంటేనే ముందుకు వెళ్తాం'' అని మంచు విష్ణు తెలిపారు.

ఎవరంటే వారు అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉదాహరణకు హైదరాబాద్ లో జర్నలిస్ట్ ఒకాయన ఉన్నారు. జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే వ్యక్తి అతను. ఒక డబ్బింగ్ సినిమా తీసుకొని ఒక పాటలో నటించి ‘మా’ అసోసియేషన్ లో మెంబర్ అయిపోయి.. ఇక్కడ లేనిపోని ఫీలింగ్స్ గొడవలు తెచ్చిపెట్టాడు. భవిష్యత్ లో అలాంటివి పొరపాటున కూడా జరగకూడదు. అందుకే మెంబర్ షిప్ విషయంలో స్ట్రిక్ట్ గా బైలాస్ ని తయారు చేయాలని అనుకుంటున్నాం. అంతేకానీ ఇప్పటికే ఉన్న బైలాస్ లో ఏమీ మార్పు చేయం. ఎవరు పోటీ చేయాలి.. ఎవరు పోటీ చేయకూడదు.. అలాంటివేమీ మార్చే ఉద్దేశ్యం లేదు. ఎవరైనా పోటీ చెయ్యొచు'' అని విష్ణు స్పష్టం చేశారు.

'మా' సభ్యులు అవడానికి తెలుగు రాష్ట్రాల్లోనే పుట్టినవారు అయ్యుండాలని తాను ఎక్కడా అనలేదని.. ప్రభు - ప్రభుదేవా - జెనీలియా - హన్సిక వంటివారు అసోసియేషన్ లో సభ్యులే అని ఈ సందర్భంగా విష్ణు గుర్తు చేశారు. ‘మా’ ఎన్నికల్లో గెలిస్తే శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తానని మొక్కుకున్నానని.. ఆ విధంగానే నాతోపాటు ప్యానెల్‌ లోని సభ్యులందరం వచ్చి శ్రీవారిని దర్శించుకున్నామని అన్నారు.

''ఏ పోటీలోనైనా గెలుపోటములు సర్వ సాధారణం. ఈసారి మేము గెలిచాం. వాళ్లు ఓడిపోయారు. వాళ్లు నెక్స్ట్ టైం గెలవొచ్చు. ఎన్నికల పోలింగ్‌ సమయంలో చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఆ విషయంలో ఇరువైపులా తప్పు జరిగింది. మేము ప్రజాస్వామ్యయుతంగా గెలిచాం. ప్రకాశ్‌ రాజ్‌ కావాలనుకుంటే సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించుకోవచ్చు. ఎన్నికల రోజు పోలింగ్ అందరి సమక్షంలోనే జరిగింది'' అని విష్ణు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ తాను ప్రకాశ్ రాజ్ ఇద్దరమే ఓపెన్ చేసి లెక్కించామని.. ఎన్నికల అధికారులు ఇంకా కౌంటింగ్ పూర్తి చేయకుండానే.. అధికారికంగా ప్రకటించకుండానే తన గెలుపు ఖాయమైందంటూ తనచను ప్రకాశ్ రాజ్ అభినందించారని విష్ణు వివరించారు.

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ సభ్యత్వానికి నాగబాబు - ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామా చేయడం పై విష్ణు మరోసారి స్పందించారు. ''ప్రకాశ్‌ రాజ్‌ - నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాటిని మేము ఆమోదించడం లేదు. దీనిపై వారికి త్వరలోనే నేను లేఖలు పంపిస్తాను. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ లో గెలుపొందిన సభ్యులు రాజీనామాలు చేసినట్లు మీడియా ద్వారానే నాకు తెలిసింది. ఒక్కరి రాజీనామా మాత్రమే నాకు అందింది. మిగిలిన వాళ్ల నుంచి కూడా వచ్చాక మేము ఒక్కసారి చర్చించుకుని.. సినీ పెద్దలతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం'' అని విష్ణు అన్నారు.

''చిరంజీవి గారు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో స్టేజ్‌ పైకి రాకముందే పవన్‌ కళ్యాణ్ తో మాట్లాడాను. మేమిద్దరం చాలా విషయాలపై చర్చించుకున్నాం. ప్రోటోకాల్‌ ప్రకారం మేమిద్దరం స్టేజ్‌ పై మాట్లాడుకోలేదు. స్టేజ్‌ మీద ఏం జరిగిందో అది మాత్రమే మీడియాకి తెలిసింది. 'మా' మన అమ్మ లాంటిది.. కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్‌ కు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. వాళ్లందర్నీ సర్‌ప్రైజ్‌ చేయడం కోసమే నేను ట్విటర్‌ లో ఆ వీడియో షేర్‌ చేశాను'' అని మంచు విష్ణు వివరించారు.

ఈ సందర్భంగా తన తండ్రి మోహన్ బాబు తో చిరంజీవి ఫోన్‌ లో మాట్లాడారని.. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో వాళ్ళననే అడిగి తెలుసుకోవాలని విష్ణు అన్నారు. ఆన్ లైన్ టిక్కెట్ల నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నట్లుగా 'మా' నూతన అధ్యక్షుడు స్పష్టం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నేతలతో తాను త్వరలో సమావేశం కానున్నానని.. ఏపీ ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల గురించి తెలుసుకుంటానని చెప్పారు. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తామని మంచు విష్ణు వెల్లడించారు.