Begin typing your search above and press return to search.

జిన్నా’ను ఓటీటీలోనైనా ఆదరిస్తారా?

By:  Tupaki Desk   |   2 Dec 2022 12:30 AM GMT
జిన్నా’ను ఓటీటీలోనైనా ఆదరిస్తారా?
X
టాలీవుడ్లో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన మంచు వారికి కొన్నేళ్ల నుంచి సినిమాల్లో అస్సలు కలిసి రావడం లేదు. ఆ ఫ్యామిలీ హీరోలందరూ సరైన సినిమాలు చేయకపోవడం ఒక సమస్య అయితే.. రకరకాల కారణాల వల్ల వ్యక్తిగత స్థాయిలో నెగెటివిటీ పెరిగిపోయి అది సినిమాల మీద బాగా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మంచు మోహన్ బాబు సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’కు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పరాభవం ఎదురైందో తెలిసిందే. ఇటీవల మంచు విష్ణుకు కూడా చేదు అనుభవం తప్పలేదు. అతడి కొత్త సినిమా ‘జిన్నా’ డీసెంట్ కామెడీ ఉన్న చిత్రమే. ఆ సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. అయినా సరే.. ఆ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. దీపావళికి తీవ్రమైన పోటీ మధ్య రిలీజ్ కావడం కూడా సినిమాకు మైనస్ అయింది. రిలీజ్, పబ్లిసిటీ ఖర్చులను మించి ‘జిన్నా’ పెద్దగా వసూలు చేసినట్లు కనిపించలేదు. ఐతే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. సన్నీ లియోన్ సహా కొన్ని ఆకర్షణలు ఉండడంతో ఓటీటీలో రిలీజైతే చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులూ ఉన్నారు.

వారి నిరీక్షణకు తెరదించుతూ గురువారం అర్ధరాత్రి నుంచే అమేజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్‌లోకి వస్తోంది ‘జిన్నా’. ఓటీటీ రిలీజ్ గురించి కొందరు నెటిజన్లు అడుగుతున్నా విష్ణు మౌనం వహించాడు ఈ మధ్య. దీంతో డిజిటల్ డీల్ కూడా కుదరలేదా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి డీల్ ఓకే అయి సినిమా ప్రైమ్‌లో వచ్చేస్తోంది. ఇంతకుముందు మోహన్ బాబు సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’ ఓటీటీలో రిలీజ్ కాగా.. అప్పుడు కూడా దాని మీద ట్రోలింగ్ నడిచింది. కానీ ‘జిన్నా’ ట్రోల్ మెటీరియల్ అయ్యే సినిమాలా అయితే లేదు. ఈ కామెడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులను బాగానే అలరిస్తుందని భావిస్తున్నారు. వ్యూస్, స్ట్రీమింగ్ మినిట్స్ ఎంత మేర వస్తాయో.. ప్రైమ్ వారికి ఈ సినిమాతో ఏమాత్రం కలిసి వస్తుందో మరి. ఓటీటీలో చూసి అయినా థియేటర్లలో సినిమా చూడనందుకు ప్రేక్షకులు రిగ్రెట్ అయి.. విష్ణు తర్వాతి సినిమాకైనా సపోర్ట్ చేస్తారేమో చూడాలి.