Begin typing your search above and press return to search.

#`మా` ఎల‌క్ష‌న్.. శిఖ‌రం ఎటు ఒరుగుతుందో?

By:  Tupaki Desk   |   22 Jun 2021 4:30 AM GMT
#`మా` ఎల‌క్ష‌న్.. శిఖ‌రం ఎటు ఒరుగుతుందో?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల హంగామా టాలీవుడ్ సర్కిల్స్ ని వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి అధ్య‌క్ష ప‌ద‌వి కోసం మంచు విష్ణు.. ప్ర‌కాష్ రాజ్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డ‌నున్నారు. అయితే ఆ ఇద్ద‌రిలో గెలుపు గుర్రం ఎక్కేది ఎవ‌రు? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

విష్ణు ఇప్ప‌టికే ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ‌.. రెబల్ స్టార్ కృష్ణం రాజు వంటి పెద్ద‌ల స‌పోర్టును తీసుకున్నారు. చాలామంది న‌టీన‌టులు విష్ణుకి అండ‌గా నిల‌వ‌నున్నార‌ని తెలుస్తోంది. అయితే ఎవ‌రు ఎంత ద‌న్నుగా నిలిచినా చివ‌రికి మెగా కాంపౌండ్ అండ‌దండ‌లే మా ఎన్నిక‌ల్లో కీల‌కం కానున్న సంగ‌తి ప‌రిశ్ర‌మ‌కు తెలిసిన‌దే.

చిరంజీవి- నాగ‌బాబు బృందాలు ఎవ‌రికి ఓటు వేయ‌మంటే ఆర్టిస్టులు వారికి ఓటు వేసేందుకు వెన‌కాడ‌రు. ప్రత్యేకించి మెగా కాంపౌండ్ క్యాడ‌ర్ కూడా బ‌లంగా ఉంటుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ మెగాస్టార్ చిరంజీవి ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తున్నారు? అన్న‌దానిపై క్లారిటీ మిస్స‌య్యింది. ఇక విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ చాలాకాలం క్రిత‌మే మెగాస్టార్ స‌పోర్ట్ కోరార‌ని అత‌డి సీనియారిటీని గౌర‌వించి తాను అండ‌గా నిలుస్తాన‌ని అన్నార‌ని కూడా ఇన్ సైడ్ స‌ర్కిల్స్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే త‌న మిత్రుడు మంచు మోహ‌న్ బాబు కోసం అయినా మంచు విష్ణుకు చిరు స‌పోర్ట్ చేస్తార‌ని భావించేవాళ్లు లేక‌పోలేదు. ప్ర‌స్తుతం క్ర‌మశిక్ష‌ణా క‌మిటీ పెద్ద‌లుగా చిరంజీవి- మోహ‌న్ బాబు వేదిక‌ల‌పై తీర్పునివ్వాల్సిన స్థాయిలో ఉన్నారు. ప‌రిశ్ర‌మ బాగోగులు చూస్తున్న‌ది వీళ్లే. మ‌రి ఒక‌రికొక‌రు అండ‌గా నిల‌వాల‌ని భావిస్తే విష్ణుకే చిరు అండ‌గా నిలుస్తారా అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

అయితే ప్ర‌కాష్ రాజ్ తో సాన్నిహిత్యం దృష్ట్యా మ‌హాభార‌తంలో కృష్ణుడిలా చిరు పాత్ర ఉండ‌బోతోంద‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. అర్జునుడు (ప్ర‌కాష్ రాజ్)కి అండ‌గా నిల‌వ‌బోయే ఏకైక శ్రీ‌కృష్ణుడిగా మెగాస్టార్ నిలుస్తార‌ని కొంద‌రు గుస‌గుస‌లు ఆడ‌డం చూస్తుంటే అస‌లేం జ‌ర‌గ‌నుంది? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుత మా అధ్య‌క్షుడు న‌రేష్ త‌న బృందాన్ని విష్ణుకే అండ‌గా నిల‌బెడుతున్న సంగ‌తి తెలిసిందే. 850 పైగా స‌భ్యులున్న మా ఎన్నిక‌ల్లో మెగాస్టార్ అండ‌దండ‌లు ఎటువైపు అన్న‌దే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్ కానుంద‌ని అంతా బ‌లంగా న‌మ్ముతున్నారు. అయితే దానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.