మనోజ్ భయ్యా.. అస్సలు అర్థం కావట్లేదుగా?

Sat Oct 16 2021 06:00:01 GMT+0530 (IST)

Manchu Manoj meets Jagan And Pawan

తండ్రిని తీవ్రంగా తప్పు పట్టిన నోటితోనే.. కొడుకును సమర్థించటం.. ఆ మాటకు వస్తే.. మనోజ్ కానీ లేకుంటే ఆ రోజు ఏం జరిగేదో? నిజంగా ‘మా’ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయంటే.. దానికి మంచు మనోజ్ కీ రోల్ ప్లే చేశాడంటూ మీడియా ముందు ప్రకాశ్ రాజ్ టీం సభ్యులు చెప్పిన మాటలు విన్న వారంతా విస్మయానికి గురి చేశారు. ‘మా’ ఎన్నికల రోజున విష్ణు.. మనోజ్ లు ఉండటం తెలిసిందే. అధ్యక్ష స్థానం కోసం పోటీ పడిన విష్ణు హడావుడి చేయటం కనిపించింది కానీ.. మనోజ్ పెద్దగా ఫోకస్ కాలేదు.కానీ.. మీడియా సమావేశంలో మాత్రం మనోజ్ గురించి పలువురు ప్రత్యేకంగా ప్రస్తావించి.. ఇరు వర్గాలను సంయమనం చేసే విషయంలో అద్భుతమైన పాత్రను పోషించారని.. పక్షపాతం లేకుండా వ్యవహరించిన వైనాన్ని పలువురు మెచ్చుకున్నారు. మంచు కుటుంబంలో మోహన్ బాబు తీరుకు మనోజ్ వ్యవహారశైలికి ఏ మాత్రం పొంతన ఉండదని చెబుతారు. దీనికి తగ్గట్లే.. తాజాగా ఆయనకు సంబంధించి అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

‘మా’ పోలింగ్ రోజున ఓటు వేయటానికి వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెన్నంటే ఉన్న మనోజ్.. చాలా దగ్గరగా ఉండటం అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. మనోజ్ భుజం మీద పవన్ చేయి ఉండటం చూసిన చాలామందికి విషయం ఒక పట్టాన వంట పట్టలేదని చెబుతారు. అంతేకాదు.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత.. పవన్ ను మనోజ్ కలిసిన ఫోటో ఒకటి బయటకు వచ్చి.. ఆసక్తికర చర్చకు తెర తీసింది.

మంచు ఫ్యామిలీకి.. మెగా ఫ్యామిలీకి సరిగా టర్మ్స్ లేవన్న వేళ.. మనోజ్ వెళ్లి పవన్ ను కలవటం ఏమిటి? అన్న ప్రశ్నకు సరైన సమాధానాన్ని చెప్పలేకపోతున్నారు. వీరికి సన్నిహితంగా ఉండే వారి వాదన వేరుగా ఉంది. నంద్యాలకు చెందిన భూమా అఖిలప్రియ పవన్ జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని.. దీనికి మధ్యవర్తిగా మనోజ్ వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. పవన్ ను కలిసిన మనోజ్.. ఆ తర్వాత సీఎం జగన్ తో భేటీ కావటంతో.. అతగాడి స్కీం ఒక పట్టాన అర్థం కావట్లేదంటున్నారు. మొత్తంగా. మనోజ్ భయ్యా ఎవరికి కొరుకుడుపడని రీతిలో ఆయన తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.