టాలీవుడ్ కి పెద్ద దిక్కు లేదా? మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్ పై డిబేట్!!

Wed Jul 21 2021 09:28:40 GMT+0530 (IST)

Manchi Vishnu Sensational Comments On Tollywood Biggies on Maa Election Row

తెలుగు సినీపరిశ్రమ(టాలీవుడ్)కు అసలు పెద్ద దిక్కు ఎవరూ లేరా? ఇప్పుడున్న సినీపెద్దలెవరూ వివాదాల్ని పరిష్కరించలేకపోతున్నారా? ఎన్టీఆర్ - ఏఎన్నార్ - దాసరి నారాయణ రావు త్రయం అదుపులో ఉంచినట్టు పరిశ్రమను వేరొకరు ఎవరూ అదుపులో పెట్టలేక చతికిలబడుతున్నారా? ఇప్పుడున్న సినీపెద్దలకు ఇది చేతకావడం లేదా..? అదేనా యువహీరో మంచు విష్ణు కామెంట్ వెనక అంతర్యం? .. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ డిబేట్ ఇది.మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో లుకలుకలపై మంచు విష్ణు ప్రముఖ వార్తా చానెల్ లైవ్ లో పలు సంచలన విషయాలను ఓపెన్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. మా అసోసియేషన్ యునిటీతో లేదని వ్యాఖ్యానించిన విష్ణు... సంఘంలో చాలా లోపాలను తూర్పారబట్టారు. ముఖ్యంగా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

పనిలో పనిగా మంచు విష్ణు చేసిన ఓ కామెంట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు సినీపరిశ్రమకు పెద్ద దిక్కు లేరు! అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్- ఏఎన్నార్ - దాసరి హయాంలో వారు ఏం చెబితే అది పరిశ్రమలో వినేవారని ఆ తర్వాత అలాంటిదేమీ లేదని వ్యాఖ్యానించారు. నిజానికి `పెద్ద దిక్కు` అంటూ విష్ణు ఎవరిని టార్గెట్ చేశారు?  అన్నది ప్రముఖంగా చర్చకు వచ్చింది. ప్రస్తుతం మా ఆర్టిస్టుల క్రమశిక్షణ విషయంలో క్రమశిక్షణా కమిటీ పని చేస్తోంది.

ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు- మెగాస్టార్ చిరంజీవి- మంచు మోహన్ బాబు- మురళీమోహన్ - జయసుధ వంటి సీనియర్ స్టార్లు కీలకంగా వ్యవహిస్తున్నారు. అయితే వీళ్లెవరూ సరిగా పని చేయలేకపోతున్నారనే ఉద్ధేశమా...?  యథాలాపంగానే మంచు విష్ణు ఆ కామెట్ చేశారా?   గడిచిన నాలుగేళ్లుగా మా అసోసియేషన్ లో జరుగుతున్న గొడవలకు విసిగి వేసారి పోయి ఇలా అనేశారా? అంటూ ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.

మరోవైపు సినీపెద్దల్లోనూ దీనిపై వాడి వేడిగా చర్చ సాగుతోంది. అయితే ఇదే మీడియా ఇంటర్వ్యూలో తాను సినీపెద్దలు ఏం చెప్పినా అనుసరించడానికి సిద్ధంగా ఉన్నానని .. పెద్దల ముందు వినమ్రంగా ఉంటానని కూడా అనడంపై చర్చ సాగుతోంది.

నిజానికి  `మా` అసోసియేషన్ పరువు మర్యాదలను ఇలా మీడియా చానెళ్ల కెక్కి మంట కలుపుతున్నారని సినీపెద్దలు చాలాకాలంగా ఆవేదన చెందుతున్నారు. గతంలో పని చేసిన మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షులు శివాజీ  రాజా- సీనియర్ నరేష్ చేసినది ఇదేనన్న విమర్శలు ఉన్నాయి. మీడియా లైవ్ లకెక్కి రచ్చ చేయడంతోనే అసలు సమస్య మొదలైంది. నాలుగేళ్లుగా మా అసోసియేషన్ వివాదాలతో మనుగడ సాగించడంపై మెగా బ్రదర్ నాగబాబు సైతం తీవ్రమైన వ్యాఖ్యనే చేశారు.

అయితే ఇప్పటికీ ఇది ఆగడం లేదు. ఇటీవల ప్రకాష్ రాజ్ ప్యానెల్ మీటింగ్ .. అనంతరం వీకే నరేష్ ఆకస్మిక మీటింగ్.. ఇప్పుడు మంచు విష్ణు చానెల్ ఇంటర్వ్యూ .. ఇవన్నీ `మా`లో ఎవరికీ తెలియని లుకలుకల్ని బయటపెట్టాయి. అయితే మీడియా కెక్కకుండా.. ఇలాంటి గొడవల్ని అదుపులో ఉంచడంలో `మా` క్రమశిక్షణా కమిటీ కానీ.. సినీపెద్దలు కానీ ఏమీ చేయలేకపోతున్నారనే భావించాల్సిందేనా..? ``మంచి మాటను బహిరంగంగా అనాలి... చెడు విషయాన్ని చెవిలో మాత్రమే చెప్పాల``ని `మా డైరీ` ఆవిష్కరణలో క్రమశిక్షణా కమిటీ పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవి చెప్పినా అందరూ పెడచెవిన పెట్టారనే భావించాలా? ఇప్పటికీ `మా` వివాదాలు పరిష్కారమయ్యే మార్గమే కనిపించడం లేదా?