మలయాళ బ్యూటీ బాలయ్యతో నటించడానికి భయపడిందట..!

Thu Jun 24 2021 08:00:02 GMT+0530 (IST)

Malayalam beauty is scared to act with balakrishna

నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ''. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ - పూర్ణ (షమ్నా కాశిమ్) హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో 'అవును' 'సీమ టపాకాయ్' 'రాజుగారి గది' వంటి చిత్రాల్లో మెప్పించిన మలయాళ బ్యూటీ పూర్ణ.. మొదటిసారి బాలయ్య వంటి స్టార్ హీరోతో నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పూర్ణ.. బాలకృష్ణతో కలిసి నటించడానికి భయపడ్డానని చెప్పారు.''బోయపాటి శ్రీను నాకు ముందు నుంచే తెలుసు. నేను ఆయనతో ఇంతకు ముందు ఓ సినిమా చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఇప్పుడు 'అఖండ' చేస్తున్నాం. బాలకృష్ణతో షూటింగ్ గురించి నాకు చెప్పినప్పుడు నేను భయపడ్డాను. మొదటి రోజు షూటింగ్ కు వచ్చినప్పుడు బోయపాటి కి ఈ విషయం చెప్పాను'' అని పూర్ణ తెలిపింది. అయితే బాలకృష్ణను చూసిన తర్వాత భయం పోయిందని.. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ దాన్ని ఎక్కడా చూపించకుండా అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడని.. ఒక సూపర్ స్టార్ ఇలా ఎలా ఉండగలడని నన్ను నేను ప్రశ్నించుకున్నాను అని పూర్ణ చెప్పారు. ఆయనతో షూటింగ్ ఒక స్కూల్ లాంటిదని.. అక్కడ ఎంతో నేర్చుకున్నానని.. బాలకృష్ణ లాంటి స్టార్ హీరోని తను ఎప్పుడూ చూడలేదని ఆమె చెప్పుకొచ్చారు.

ఇకపోతే 'అఖండ' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. లాక్ డౌన్ ఎత్తేయడంతో తిరిగి చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జులై ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ లో ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించనున్నారని సమాచారం. ఈ చిత్రంతో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శ్రీకాంత్ - జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.