రకుల్ కారణంగా ఆందోళనలో మేకర్స్...?

Fri Sep 25 2020 13:40:12 GMT+0530 (IST)

Makers anxious due to Rakul ...?

బాలీవుడ్ డ్రగ్ వ్యవహారంలో స్టార్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ - దీపికా పదుకొనే లకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బాలీవుడ్ శాండిల్ వుడ్ లను కలవరపెట్టిన డ్రగ్ మాఫియా.. ఇప్పుడు టాలీవుడ్ లో కూడ సెగ రేపింది. ఈ నేపథ్యంలో రకుల్ నేడు ఎన్సీబీ అధికారుల ముందు హాజరుకానుంది. ఎన్సీబీ నోటీసుల ప్రకారం సెప్టెంబర్ 24న రకుల్ విచారణకు రావాల్సి ఉండగా.. ఆమెకు సమన్లు అందడం లేట్ అయిన కారణంగా ఈ రోజు అటెండ్ అవుతోంది. అయితే ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ని ఎంక్వైరీ ఎదుర్కుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాల మేకర్స్ ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది.కాగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో జాన్ అబ్రహంతో కలిసి 'ఎటాక్' మరియు అర్జున్ కపూర్ తో ఓ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'ఇండియన్ 2' మరియు శివ కార్తికేయన్ 'అయలాన్' చిత్రంలోనూ రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తెలుగులో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాల మేకర్స్ అందరూ రకుల్ డ్రగ్ ఇష్యూలో ఉండటంతో షూటింగ్స్ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారట. పవన్ కళ్యాణ్ తో ఓ పీరియాడికల్ మూవీ రూపొందిస్తున్న క్రిష్.. 40 డేస్ సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ చేశారు. అదే సమయంలో డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు రావడంతో ఆమె షూటింగ్ కి ప్యాకప్ చెప్పి.. ఢిల్లీ వెళ్లి తనపై మీడియాలో అనాధారిత ఆరోపణలు వస్తున్నాయని హైకోర్టులో పిటిషన్ వేసింది.

ఈ క్రమంలో కొన్ని రోజులు షూటింగ్ లో ఆమె పాల్గొనలేదని తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా షూటింగ్ కి అంతరాయం కలిగింది. ఇక రకుల్ మళ్ళీ హైదరాబాద్ వచ్చి షూటింగ్ లో పాల్గొంటోంది అనుకునేలోపే ఆమెకు ఎన్సీబీ నోటీసులు అందాయి. దీంతో రకుల్ ముంబై కి వెళ్లాల్సి వచ్చింది. ఈ రోజు రకుల్ ఎన్సీబీ ఎదుట హాజరవుతున్నప్పటికీ ఎంక్వరీ కోసం ఆమె కొన్నాళ్ళు అక్కడే ఉండాల్సి రావొచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో రకుల్ క్రిష్ ప్రాజెక్ట్ కు మరికొన్ని రోజులు సెలవు పెట్టే అవకాశాలు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి పవన్ సినిమాపై ఫోకస్ పెట్టాలనుకున్న క్రిష్ కి రకుల్ వ్యవహారం ఆందోళన కలిగిస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు.