భారీ ధరకు 'మేజర్' ఓవర్సీస్ రైట్స్..!

Thu Jun 10 2021 11:00:01 GMT+0530 (IST)

'Major' overseas rights at a huge price ..!

వరుస విజయాలతో దూకుడుమీదున్న టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అడవి శేష్ ''మేజర్'' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా చిత్రంలో ఎన్‌ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ కనిపించనున్నాడు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హిందీ తెలుగు మలయాళ భాషల్లో జూలై 2న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా మిగతా సినిమా మాదిరిగానే విడుదల వాయిదా పడింది.సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న 'మేజర్' సినిమా తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ దేశవ్యాప్తంగా విశేష స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్ రాబట్టి అందరి ప్రశంసలు అందుకుంది. దీంతో 'మేజర్' బిజినెస్ వర్గాల్లో 'మేజర్' హాట్ కేక్ లా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ మరియు ఇతర హక్కులు ఫాన్సీ రేట్లకు అమ్ముడుపోతున్నాయి.

'కబీర్ సింగ్' 'కేజీఎఫ్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను విదేశాల్లో పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 'వీకెండ్ సినిమా' వారు ''మేజర్'' ఓవర్సీస్ రైట్స్  దక్కించుకున్నారు. సదరన్ స్టార్ ఇంటర్నేషనల్ సహకారంతో ఈ చిత్రాన్ని యుఎస్ఎ - కెనడా - ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మరియు సింగపూర్ దేశాలలో మూడు భాషలలో విడుదల చేయనున్నారు. ఈ ఓవర్ సీస్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

కాగా ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడుల సమయంలో బందీలను రక్షించి వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని 'మేజర్' చిత్రంలో చూపించబోతున్నారు. దీనికి అడవి శేష్ స్టోరీ - స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ఇందులో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల మరియు బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి సంభాషణలు రాస్తున్నారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వినయ్ కుమార్ - పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ''మేజర్'' చిత్రాన్ని నిర్మిస్తోంది.