న్యూయార్క్ నగరంలో మహేష్ ను ఎవరూ పట్టించుకోలేదా..?

Mon Jun 27 2022 11:10:56 GMT+0530 (India Standard Time)

Mahesh in New York City

సూపర్ స్టార్ మహేష్ బాబు పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని కూడా పిలవబడుతుంటారు. సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం వారితో గడపాలని చూస్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా హాలిడేకి తీసుకెళ్తుంటారు.ఏదైనా సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్ కు వెళ్లడం మహేష్ బాబుకు అలవాటు. 'సర్కారు వారి పాట' సినిమా విడుదలైన సందర్భంగా ఎప్పటిలాగే విదేశాలు చుట్టిరావడానికి వెళ్లారు. ఈ సినిమా విజయాన్ని తనకెంతో ఇష్టమైన వ్యక్తులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

మహేష్ బాబు ఇటీవల సతీమణి నమ్రతా శిరోద్కర్ మరియు వారి పిల్లలు సితార - గౌతమ్ లతో కలిసి హాలిడేకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు.

మహేష్ అండ్ ఫ్యామిలీ న్యూయార్క్ లోని మన్ హట్టన్ ఫిఫ్త్ అవెన్యూలో షికార్ చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అలానే సమ్మర్ నైట్స్.. సిటీ లైఫ్ అంటూ మహేష్ సైతం తన భార్యతో ఉన్న ఓ ఫోటోని కూడా పోస్ట్ చేసారు. ఎల్లప్పుడూ బిజీగా ఉండే ఏరియాలో సూపర్ స్టార్ నడుచుకుంటూ వెళ్తున్న వీడియో మరియు అక్కడ దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.

అయితే ఫుల్ రద్దీగా ఉండే ప్రదేశంలో మహేష్ బాబు అంత ఫ్రీగా తిరగడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే వీకెండ్ లో మన తెలుగు వాళ్ళు టైమ్ స్క్వేర్ ను ఎక్కువగా విజిట్ చేస్తుంటారు. టాలీవుడ్ సెలబ్రిటీలు కనిపిస్తే ఫోటోలు అంటూ ఎగబడుతుంటారు.

కానీ మహేష్ ను చూసిన ఎవరూ సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. న్యూయార్క్ నగర వీధుల్లో తిరుగుతున్న మహేష్ అండ్ ఫ్యామిలీని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని.. అందుకే వారు అంత ఫ్రీగా షికారు చేయగలిగారని అంటున్నారు.

అభిమానుల తాకిడి ఉంటుంది కాబట్టి మన సెలబ్రిటీలు ఇండియాలో తిరిగలేరు. అందుకే విదేశాలకు వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు మహేష్ బాబు కుటుంబం ఎలాంటి ఇబ్బంది లేకుండా న్యూయార్క్ నగరంలో తిరుగుతూ సమయాన్ని గడుపుతున్నారు.

ఏదేమైనా స్టార్ హీరో అయినప్పటికీ మహేష్ అన్నిటినీ పక్కనపెట్టి తన పిల్లల కోసం టైం స్పెండ్ చేయడం అభినందించదగ్గ విషయమే. అందుకే అందరూ ఆయన్ను ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ సూపర్ స్టార్ అంటుంటారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ బాబు తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమాని మహేష్ హాలిడే ముగించుకొని వచ్చిన వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. 'అతడు' 'ఖలేజా' తర్వాత వీరి కాంబోలో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇదే క్రమంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ భారీ సినిమా చేయనున్నారు. ఇది కచ్చితంగా పాన్ ఇండియా మూవీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఈ కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇన్నాళ్లకు 'మహేష్ - రాజమౌళి' ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతున్నందుకు ఖుషీగా ఉన్నారు. 'బాహుబలి' 'RRR' తర్వాత జక్కన్న చేయబోయే ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.