పవన్ - మహేష్ భాయీ భాయీ.. ఇండస్ట్రీలో సూపర్ ట్రెండ్.. సంబరాల్లో ఫ్యాన్స్!

Sun Apr 18 2021 17:51:44 GMT+0530 (IST)

Mahesh hopes to recover quickly from power star Corona injury

దేశంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రత్యేకం అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఏ రాష్ట్రంలో లేనన్ని థియేటర్లు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి. ఇక అభిమానం గురించి చెప్పాల్సి వస్తే.. రాస్తే రామాయణం.. చెబితే భారతం అవుతుంది! ఫ్యాన్స్ తమ హీరోలను ఎంతగా అభిమానిస్తారో.. ఆరాధిస్తారో.. వాళ్లకు మాత్రమే తెలుసు. తమకు నచ్చిన హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.అభిమానులందు హార్డ్ కోర్ అభిమానులు వేరయా అన్నట్టుగా ఉంటారు కొందరు. తమ హీరో ఇమేజ్ ఎప్పుడూ ఎవరెస్టుపైనే ఉండాలని ఆశిస్తుంటారు. దీంతో.. ఇతర హీరోల వేవ్ తట్టుకోలేకపోతుంటారు. తమ హీరోల వైఫల్యాలతో తీవ్ర భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఈ కారణం చేతనే.. అప్పట్లో పోస్టర్లు చించేసి పేడ విసిరికొట్టేవారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు.

అయితే.. రానురానూ ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. హీరోలు ఒకరి ఫంక్షన్లకు ఒకరు వెళ్లడం.. ఒకరి గురించి మరొకరు పాజిటివ్ గా స్పందించడం పెరుగుతూ వస్తోంది. తద్వారా.. తామంతా ఒకటేనని చాటిచెప్తూ వస్తున్నారు. అయితే.. పెద్దహీరోల విషయంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటే.. దాని ఇంపాక్ట్ వేరే లెవల్లో ఉంటది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ - మహేష్ బాబు రిలేషన్ చాలా ముందుంది.

‘అర్జున్’ సినిమా సమయంలో వరంగల్ లో పైరసీ సీడీ షాపుపై దాడి ఘటనలో మహేష్ పై కేసు నమోదైంది. ఈ సమయంలో మహేష్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించాడు పవన్. పైరసీపై యుద్ధానికి మహేష్ తో కలిసి ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. ఆ తర్వాత జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ అందించి ఫ్రెండ్షిప్ ను కంటిన్యూ చేశారు మహేష్.

ఇక ఇటీవల మహేష్ మూవీ ‘మహర్షి’ జాతీయ అవార్డు గెలుచుకోవడంతో శుభాకాంక్షలు తెలిపారు పవన్. సూపర్ స్టార్ తోపాటు యూనిట్ మొత్తానికి గ్రీటింగ్స్ తెలిపారు. ఇక పవన్ రీ-ఎంట్రీ మూవీపై ప్రశంసల జల్లు కురిపించారు మహేష్. పవన్ అద్భుతంగా నటించారని ట్వీట్ చేశారు. తాజాగా.. పవర్ స్టార్ కరోనా బారిన పడడంతో.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

దీంతో.. ఇద్దరి అభిమానులు ఎంతగానో సంతోషించారు. అంతేకాదు.. పుట్టపర్తిలో మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవాలయాలకు వెళ్లి పవన్ కోలుకోవాలని పూజలు చేయడంపై అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సొషల్ మీడియాలో ఈ విషయం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

ఇంతేకాదు.. గతంలో ‘భరత్ అను నేను’ ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించాడు మహేష్. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి మెగాస్టార్ ను ఇన్వైట్ చేశాడు. ఇది తెలుగు ఇండస్ట్రీకి శుభ పరిణామమని ఈ ట్రెండ్ ను ఇలాగే కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.