Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఫ్యాన్స్ తెచ్చిన తంట‌.. నో బెనిఫిట్ షోస్‌!

By:  Tupaki Desk   |   15 Aug 2022 5:30 PM GMT
మ‌హేష్ ఫ్యాన్స్ తెచ్చిన తంట‌.. నో బెనిఫిట్ షోస్‌!
X
అభిమానుల అత్యుత్సాహం అనర్థాల‌కు దారితీస్తూ వుంటుంద‌న్న‌ది చాలా సంద‌ర్భాల్లో స్ప‌ష్ట‌మైంది. అది ఇప్పుడు కాకినాడ‌లో బునిఫిట్ షోల ర‌ద్దుకు ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింది. వివ‌రాల్లోకి వెళితే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ మూవీ `పోకిరి`. ఈ మూవీని 4కె లోకి మార్చి మ‌హేష్ పుట్టిన రోజున ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో, యుఎస్ లో, క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరు, చెన్నై వంటి ప‌లు ప్రాంతాల్లో ఆగ‌స్టు 9న ప్ర‌త్యేక షోల‌ని ప్ర‌ద‌ర్శించారు.

ఈ షోల‌కు రికార్డు స్థాయిలో వ‌సూళ్లు న‌మోదైన విష‌యం తెలిసిందే. కోటికి పైగా బెనిఫిట్ షోల ద్వారా ఈ మూవీకి వ‌సూళ్లు రావ‌డం రికార్డుగా చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ బెనిఫిట్ షోల కాకినాడ‌లోని ప‌లు థియేట‌ర్ల‌లో ప్ర‌త్యేకంగా మ‌హేష్ బాబు అభిమానుల కోసం ప్ర‌ద‌ర్శించారు. అయితే అదే స‌మ‌యంలో కొన్ని థియేట‌ర్ల స్క్రీన్ ల‌ని అభిమానులు అత్యుత్సాహంతో చించేసి ర‌చ్చ ర‌చ్చ చేశారు.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఒక్కో థియేట‌ర్ స్క్రీన్ విలువ 5 నుంచి 7 ల‌క్ష‌ల వ‌ర‌కు వుంటుంద‌ట‌. అయితే ఆ మొత్తాన్ని ఎవ‌రి నుంచి వ‌సూలు చేయాలో తెలియ‌క కాకినాడ ఎగ్జిబిట‌ర్స్ తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇకపై జిల్లాలోని ఏ థియేట‌ర్లలోనూ ఫ్యాన్స్ బెనిఫిట్ షోలు కానీ, ప్ర‌త్యేక షోలు కానీ ప్ర‌ద‌ర్శించ రాద‌ని తీర్మాణం చేస‌కున్నార‌ట‌. ఆగ‌స్టు 11 నుంచి ఈ నిబంధ‌న‌ని అమ‌ల్లోకి తీసుకొచ్చార‌ట‌.

అంతే కాకుండా ఎవ‌రైనా ఈ నిబంధ‌న‌ని అతిక్ర‌మించినా వారికి ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా విధించ‌డ‌మే కాకుండా ఇకపై అలాంటి థియేట‌ర్ యాజ‌మాన్యానికి యునియ‌న్ ఏ విష‌యంలోనూ స‌హ‌య స‌హ‌కారాలు అందించ‌కూడ‌ద‌ని నిబంద‌న పెట్టార‌ట‌. అంతే కాకుండా డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా స‌హ‌క‌రించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశార‌ట‌. ఇది ఇప్ప‌డు మెగా ఫ్యాన్స్ కు తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింద‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు 22న మెగాస్టార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా `ఘ‌రానా మొగుడు` మూవీని రీ రిలీజ్ చేయ‌బోతున్నారు.

దీనికి కాకినాడ‌లో థియేట‌ర్లు ఇవ్వ‌డం క‌ష్ట‌మే. అంతే కాకుండా సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా `జ‌ల్సా` మూవీని 4కెలోకి మార్చి రిలీజ్ చేస్తున్నారు. దీనికి కూడా కాకినాడ‌లో థియేట‌ర్లు ఇవ్వ‌డం లేద‌ట‌. ఇది ఇప్ప‌డు కాకినాడ మెగా ఫ్యాన్స్ కి తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింద‌ని చెబుతున్నారు.