Begin typing your search above and press return to search.

మహేష్ - ట్వీట్లు భేష్

By:  Tupaki Desk   |   8 Aug 2018 8:07 AM GMT
మహేష్ - ట్వీట్లు భేష్
X
పోటీ విపరీతంగా ఉన్న తరుణంలో పక్క హీరో సినిమాను పొగడాలంటే కొందరు హీరోలు మహా నామోషీగా ఫీలవుతారు. అది ఈగోనో లేక ఇంకొకరి విజయాన్ని ఆస్వాదించలేని తత్వమో కానీ మహేష్ మాత్రం ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న గూఢచారి గురించి ట్విట్టర్ లో స్పందించాడు. సినిమా చాలా బాగుందని అడవి శేష్ తో సహా టీమ్ లోని ప్రతి ఒక్కరి కృషి ఇందులో కనిపిస్తోందని అభినందించాడు. దీంతో హీరోతో సహా టీమ్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అది వేరే సంగతి. ఇలా వేరే సినిమాల గురించి మహేష్ ట్వీట్లు చేయటం ఇదే మొదటి సారి కాదు. ఆ మధ్య రంగస్థలం గురించి ప్రత్యేకంగా వరస ట్వీట్లు పెట్టి కాంప్లిమెంట్స్ తో ముంచెత్తాడు. తన భరత్ అనే నేనుకు పోటీగా ఉన్నా అదేమి ఆలోచించలేదు. గతంలో అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను మెచ్చుకోవడం సోషల్ మీడియాలో బాగా హై లైట్ అయ్యింది.

ఇలా సోషల్ మీడియాలో ఇతర సినిమాలను ప్రమోట్ చేయటం ద్వారా మహేష్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రాజమౌళి తరహాలో వేరే సినిమా ఏదైనా నచ్చినప్పుడు మొహమాటం లేకుండా పొగిడేస్తున్నాడు. అందులోనూ గూఢచారి లాంటి స్పై థ్రిల్లర్స్ తో మహేష్ కు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఇప్పటికీ టాలీవుడ్ లో గూఢచారి సినిమా అంటే వెంటనే గుర్తొచ్చేది మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణే. అంతగా ప్రభావం చూపిన ఆ పాత్రలో మహేష్ ను చూడాలని ఫాన్స్ కోరుకున్నారు కానీ సరైన కథ దొరకని కారణంగా అది ఇంకా నెరవేరలేదు. అసలు గూఢచారి కథనే మహేష్ చేసుంటే ఏ రేంజ్ లో ఉండేదా అని ఊహించుకున్న అభిమానులు లేకపోలేదు. నిజంగా అలాంటి కథతో థ్రిల్లింగ్ టేకింగ్ తో మహేష్ ని స్పై చూపిస్తే రికార్డులు ఏమవుతాయో ప్రత్యేకంగా చెప్పాలా.