ఛాంపియన్ గా మారిన సంక్రాంతి మొగుడు గారు!

Fri Jan 17 2020 10:39:22 GMT+0530 (IST)

Mahesh babu Sarileru Neekevvaru Sankranti Mogudu Turns as Sankranti Champion

సంక్రాంతి ప్రతి ఏడాది వస్తుంది.  కానీ ఇలాంటి సంక్రాంతి పోటీ ప్రతి ఏడాది మాత్రం రాదు.. రాబోదు.   మూడు నెలల ముందు సంక్రాంతి సినిమాల ప్రచారం ప్రారంభించగానే పోటీ ఎలా ఉండబోతుందనే సూచనలు అందరికీ అందాయి. ప్రతిదీ పోటీనే.  అయితే అసలు పోటీ కలెక్షన్లు కదా.  ఈ కలెక్షన్స్ విషయం కూడా చాలా దూరం వెళ్లిపోయింది. నాన్ బాహుబలి రికార్డులు ఎప్పుడో బద్దలైపోయాయని ఎవరికి వారు అంటున్నారు.సోషల్ మీడియాలో ఈ కలెక్షన్ల భాగోతంపై తెగ జోకులు పేలుతున్నాయి. నెటిజన్లు సెటైర్లు.. కౌంటర్లు వేస్తున్నారు.  అయితే జనాల్లో ఉన్న ఈ ఫీలింగ్ సంగతి పట్టించుకోకుండా ఒకరేమో 'సంక్రాంతి మొగుడు' అని ప్రచారం చేసుకుంటూ ఉంటే మరొకరు 'సంక్రాంతి విన్నర్' అని ప్రచారం చేసుకుంటున్నారు.  వీటి మీద ట్రోలింగ్ సాగుతున్న విషయం ఫిలిం మేకర్లకు తెలుసో లేదో అర్థం కావడం లేదు.

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' విషయమే తీసుకుంటే ప్రేక్షకుల నుండి.. రివ్యూయర్ల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందన్నది కాదనలేని నిజం.  అయితే మాస్ సినిమా కావడంతో మొదటి రోజు నుండి కలెక్షన్స్ భారీగా ఉన్నాయి. పండగ జోరు తగ్గిన తర్వాత కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తోందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. అయినా నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పిందని.. బ్రేకీవెన్ అయిందని..సంక్రాంతి మొగుడు అని ప్రచారం చేసుకుంటూ ఉండడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువ అవుతోంది.  'సరిలేరు నీకెవ్వరు' టీమ్ కొత్తగా విడుదల చేసిన పోస్టర్లలో సంక్రాంతి మొగుడు స్థానంలో సంక్రాంతి ఛాంపియన్ అని ఉంది.

దీంతో ట్రోలింగ్ ఎఫెక్ట్ తోనే 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ రూటు మార్చి 'సంక్రాంతి ఛాంపియన్' అనే టాగ్ తో కొత్త పోస్టర్లు విడుదల చేసి ఉంటారనే వాదన వినిపిస్తోంది. మొదటి రోజు నుండే సంక్రాంతి మొగుడు అని ప్రచారం చేయడంతో సినిమాపై వచ్చిన ట్రోలింగ్ ను తగ్గించే ఉద్దేశంతో ఇలా కొత్త టాగ్ ఇచ్చారని అంటున్నారు. మరి ఈ ఛాంపియన్ ను చూసి నెటిజన్లు ఊరుకుంటారా లేదా దీనిపై కూడా ట్రోలింగ్ చేస్తారా అనేది వేచి చూడాలి.