Begin typing your search above and press return to search.

సర్కారు వారి పాట'లో మహేష్ టీనేజ్ లుక్ అదేనా...?

By:  Tupaki Desk   |   31 May 2020 12:30 PM GMT
సర్కారు వారి పాటలో మహేష్ టీనేజ్ లుక్ అదేనా...?
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో నటిస్తున్న 27వ సినిమా 'సర్కారు వారి పాట'. ఈ రోజు కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ ని చిత్రబృందం అధికారికంగా ఖరారు చేస్తూ పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి 'గీత గోవిందం' ఫేమ్ పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తుండగా మైత్రీమూవీమేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తుండగా పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా ఏయస్ ప్రకాష్ పని చేస్తుండగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా చేయబోతున్నారు. ఈరోజు రిలీజ్ అయిన పోస్టర్ లో మహేష్ బాబు బ్యాక్ సైడ్ హాఫ్ లుక్ ని రివీల్ చేశారు. చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. బ్లాక్ షర్ట్ .. ఫ్రీ హెయిర్ స్టైల్ తో మాసీగా కనిపిస్తున్నాడు. వీటన్నిటికీ మించి మహేష్ మెడపై రూపాయి కాయిన్ టాటూ కూడా కనిపిస్తోంది. కాగా మహేష్ ఈ చిత్రంలో మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ లో మహేష్ లుక్ ఒక పాత్రకి సంభందించింది అయ్యుంటుందని అనుకుంటున్నారు.

కాగా ఈ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో డైలీ ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వాటిలో మహేష్ బాబు క్లీన్ షేవ్ తో కనిపించాడు. టీనేజ్ కుర్రాడిలా మారిపోయి తన తనయుడికే బ్రదర్ లా కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన 'సర్కారు వారి పాట' పోస్టర్ లో మహేష్ లుక్ కి ఈ మధ్య మహేష్ లుక్ కి అసలు పొంతన లేదు. పోస్టర్ లో మహేష్ గడ్డం తో కనిపిస్తూ రఫ్ లుక్ లో స్టైలిష్ గా ఉండగా ఇప్పుడు మాత్రం మహేష్ మిల్కీ బాయ్ లా కనిపిస్తున్నాడు. దీనిని బట్టి చూస్తే 'సర్కారు వారి పాట' లో మహేష్ టీనేజ్ బాయ్ పాత్ర కూడా ఉంటుందని.. దాని కోసమే ఈ మధ్య మహేష్ లుక్ అలా మైంటైన్ చేస్తూ వస్తున్నాడు అని సినీ అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో మహేష్ చాలా రోజుల తర్వాత ప్లే బాయ్ గా కనిపించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో మహేష్ క్వారంటైన్ లుక్ ఆ పాత్ర కోసమే అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈరోజు రిలీజైన మహేష్ మాస్ లుక్ కి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారని మాత్రం చెప్పవచ్చు.