అంతా ఆయన్ను కోరుతున్నారు.. మహేష్ మాత్రం నో చెప్పాడట!

Mon May 23 2022 14:01:53 GMT+0530 (IST)

Mahesh Saying No to His Movie Story

తమిళ సినిమా ఇండస్ట్రీతో పాటు మొత్తం దేశ వ్యాప్తంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. విక్రమ్ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఖైదీ.. మాస్టర్ ల తరహాలోనే విక్రమ్ కూడా సూపర్ హిట్ ఖాయం అంటున్నారు.విక్రమ్ సూపర్ హిట్ అయితే లోకేష్ కనగరాజ్ డిమాండ్ ఫుల్ గా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్ తో ఈయన తదుపరి సినిమా చేయబోతున్నాడు. అంతే కాకుండా రజినీకాంత్ కూడా పిలిచి మరీ సినిమా చేద్దామని అడిగాడట. అజిత్ నుండి కూడా లోకేష్ కనగరాజ్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు తెలుగు హీరోలు కూడా ఇద్దరు ముగ్గురు లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయాలని భావిస్తున్నారట.

ఇంత మంది ఆయన తో సినిమా చేయడం కోసం ఆసక్తిగా ఉంటే.. ఆయన మాత్రం ఇటీవలే మహేష్ బాబును కలిసి కథ వినిపించాడని సమాచారం అందుతోంది. లోకేష్ వినిపించిన కథ విషయంలో మహేష్ బాబు ఆసక్తిగా లేడని కూడా తెలుస్తోంది. పైగా మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలు.. కమిట్‌మెంట్స్ తో బిజీగా ఉన్నాడు. కనుక మూడు నాలుగు సంవత్సరాల వరకు ఆయన వేరే సినిమాలు చేసే అవకాశం లేదు.

ఇంత బిజీగా ఉన్న మహేష్ బాబు ఆ తమిళ దర్శకుడు చెప్పిన కథ నచ్చక పోవడంతో నో చెప్పాడని తెలుస్తోంది. కథ నచ్చితే ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ ల తర్వాత చేద్దాం అని చెప్పేవాడు.

కాని మహేష్ బాబు అసలు లోకేష్ కనగరాజ్ చెప్పిన కథ విన్నగానే ఇది నాకు సెట్ అవ్వదు అన్నట్లుగా చెప్పాడట. దాంతో ఆయన మరో కథను మహేష్ బాబు కు వినిపించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

విక్రమ్ సినిమా తర్వాత విజయ్ తో మరో సినిమాను చేయబోతున్న స్వయంగా లోకేష్ కనగరాజ్ వెళ్లడించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఎవరితో సినిమా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు విజయ్ తో సినిమాను లోకేష్ కనగరాజ్ పట్టాలెక్కించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ విక్రమ్ ప్రమోషన్ లో ఉన్నాడు. విక్రమ్ సినిమా తర్వాత ఆయన తదుపరి సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.