ట్రిపుల్ ఆర్ టీమ్ ని ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్!

Mon May 16 2022 12:59:42 GMT+0530 (IST)

Mahesh Fans Trolling Triple R Team!

ఈ మధ్య ఫ్యాన్స్ తమహీరోపై వున్న ప్రేమతో మరో హీరో సినిమాని ఫ్లాప్ చేస్తున్నారు. కనీసం యావరేట్ ఆడాల్సిన మూవీస్ ని కూడా డిజాస్టర్ లుగా మారుస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ గురించి ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిందే. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా మహేష్ ఫ్యాన్స్ తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. నచ్చని వారిని ట్రోల్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఏకంగా ట్రిపుల్ ఆర్ టీమ్ నే టార్గెట్ చేస్తూ వారిపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మూవీ 'సర్కారు వారి పాట' ఇటీవలే భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు రెండేళ్ల విరామం తరువాత మహేష్ సినిమా రిలీజ్ కావడంతో ప్రేక్షకులు అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఫస్ట్ షో నుంచే ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మిశ్రమ స్పందనని సొంతం చేసుకుంది. కలెక్షన్స్ గురించి మేకర్స్ భారీ స్థాయిలోనే ప్రచారం చేస్తున్నారు కానీ ఆ స్థాయిలో వసూ్లు కనిపించడం లేదని టాక్.

ఇదిలా వుంటే సినిమా విడుదలై ఐదు రోజులవుతున్న ఏ స్టార్ నుంచి 'సర్కారు వారి పాట' గురించి స్పందన లేకపోవడం మరీ ప్రధానంగా ట్రీపుల్ ఆర్ టీమ్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ మరింత అసహనానికి గురవుతున్నారట. ట్రిపుల్ ఆర్ రిలీజ్ టైమ్ లో మహేష్ హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ ల పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు. సినిమా మామూలుగా లేదంటూ ఓ రేంజ్ లో ట్రిపుల్ ఆర్ టీమ్ ని పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే తమ హీరో సినిమా రిలీజ్ అయి ఐదు రోజులు అవుతున్నా ట్రిపుల్ ఆర్ టీమ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం మహేష్ ఫ్యాన్స్ ని తీవ్ర అసహనానికి గురిచేస్తోందట.

దీనికి తోడు ట్రిపుల్ ఆర్ టీమ్ తమిళ హీరో శివ కార్తికేయన్ 'డాన్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ మహేష్ ఫ్యాన్స్ ని మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఒక తమిళ హీరో సినిమా బ్లాక్ బస్టర్ అంటూ పొగుడుతున్నారే కానీ మన తెలుగు సూపర్ స్టార్ సినిమా పై ఇంత వరకు ట్వీట్ చేయకపోవడం ఏంటని మండి పడుతున్నారు. ట్రిపుల్ ఆర్ టీమ్ శివ కార్తికేయన్ సినిమాపై స్పందించడానికి ఓ కారణం వుంది.

ట్రిపుల్ ఆర్ తమిళ వెర్షన్ రిలీజ్ సమయంలో శివ కార్తికేయన్ తను నటించిన 'డాన్' మూవీ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ట్రిపుల్ ఆర్ టైమ్ లో తన సినిమా థియేటర్లలోకి రాకూడదని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ కారణంగానే 'డాన్' సినిమా లేట్ గా రిలీజ్ అయింది. మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు కాబట్టే ట్రిపుల్ ఆర్ టీమ్ శివ కార్తికేయన్ సినిమాపై ట్వీట్ చేసిందని చెబుతున్నారు.

కానీ ఫ్యాన్స్ మాత్రం అదంతా మాకు తెలవదు.. మా సినిమాపై ఎందుకు స్పందించలేదని ట్రిపుల్ ఆర్ టీమ్ ని ట్రోల్ చేస్తున్నారు. మహేష్ సినిమా తొలి రోజు డిజాస్టర్ అని ఓ ప్రముఖ టీవి ఛానల్ వార్తా కథనాల్ని ప్రసారం చేసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఫ్యాన్స్ సదరు టివి ఛానల్ పై దారుణంగా విమర్శలు చేస్తూ విరుచుకుపుడతున్నారు.