జక్కన్నతో సినిమా చేయాల్సిందే.. ఫిక్స్ అయిన స్టార్ హీరో..?

Wed Dec 08 2021 08:00:01 GMT+0530 (IST)

Mahesh Babu is also set to do a film with Jakkanna

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కలయికలో ఓ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. పదేళ్ల క్రిందటే ఈ క్రేజీ కాంబినేషన్ కోసం చర్చలు ప్రారంభం అవ్వగా.. ఇన్నాళ్లకు గానీ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతోంది.RRR తర్వాత తాను చేయబోయే సినిమా మహేష్ దే అని రాజమౌళి ఏడాది క్రితమే క్లారిటీ ఇచ్చారు. జక్కన్నతో సినిమా చేతులు కలపడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నానని.. షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మహేష్ అన్నారు.

ఇటీవల ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో వేదికగా రాజమౌళి - మహేష్ ప్రాజెక్ట్ ను మరోసారి కంఫర్మ్ చేశారు. దీంతో వీరి కాంబోలో సినిమా చూడాలని ఎప్పటి నుంచో వేచి చూస్తున్న సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు సైతం వీలైనంత త్వరగా జక్కన్నతో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చిన మహేశ్.. పాన్ ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి మూవీతో ఆ దిశగా వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ససూపర్ స్టార్ కు ఇది ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిలుస్తుంది.

ఇప్పుడప్పుడే ఈ స్పెషల్ ప్రాజెక్ట్ గురించి ఏమీ చెప్పలేనని అంటున్న మహేష్.. ఇది కచ్చితంగా భారీ ప్రాజెక్ట్ అవుతుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' మరియు త్రివిక్రమ్ సినిమాలు పూర్తైన తర్వాత జక్కన్న ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే మహేష్ సినిమా కోసం కథ రెడీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ అడ్వెంచరస్ స్టోరీ సిద్ధం చేయమని రాజమౌళి కోరాడని బాహుబలి రచయిత ఆ మధ్య వెల్లడించారు. దీని కోసం తండ్రీకొడుకుకు ఇష్టమైన దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రచనలపై రీసెర్చ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' విడుదలకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జనవరి 7న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా థియేటర్లలోకి వచ్చేస్తే దర్శకధీరుడు ట్రిపుల్ ఆర్ మోడ్ లో నుంచి బయటకు వచ్చేసారు.

ఈ క్రమంలో రాజమౌళి కొన్ని రోజుల గ్యాప్ తీసుకొని మహేష్ బాబు సినిమా మీద వర్క్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అయితే అది ముందుగా అనుకున్నట్లు అడ్వెంచర్ జోనర్ లో ఉంటుందా లేదా మరో కొత్త ఐడియాతో వస్తారా అనేది చూడాలి. ఏదేమైనా మహేష్ - జక్కన్న క్రేజీ కాంబోలో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

'రాజమౌళి-మహేష్' చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కు ఎస్. గోపాల్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. రాజమౌళి గత చిత్రాలకు వర్క్ చేసే టెక్నికల్ టీమ్ అంతా ఇందులో కూడా భాగం కానున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ పెట్లా దర్శకత్వంలో చేస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న #SSMB28 ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.