Begin typing your search above and press return to search.

బాలయ్య 'అన్ స్టాపబుల్' కి మహేశ్ బాబు!

By:  Tupaki Desk   |   4 Dec 2021 4:31 AM GMT
బాలయ్య అన్ స్టాపబుల్ కి మహేశ్ బాబు!
X
బాలకృష్ణ తన తాజా చిత్రమైన 'అఖండ'తో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. బోయపాటితో కలిసి హ్యాట్రిక్ హిట్ ను దక్కించుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు.

మరో వైపున గోపీచంద్ మలినేనితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంకో వైపున 'ఆహా' కోసం 'అన్ స్టాపబుల్' చేస్తున్నారు. తాజాగా ఈ టాక్ షోలో మహేశ్ బాబు పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన షూటింగు ఈ రోజున జరగనున్నట్టు చెబుతున్నారు.

మహేశ్ బాబు కొంతకాలంగా మోకాలు నొప్పితో బాధపడుతున్నాడు. ఇందుకు సంబంధించి చిన్నపాటి సర్జరీ పడుతుందని తెలిసినప్పటికీ, వరుస షూటింగుల కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన 'సర్కారువారి పాట' షూటింగును పూర్తి చేసిన తరువాతనే సర్జరీకి వెళదామని అనుకున్నాడట.

కానీ బాధను భరించడం కష్టం అవుతూ ఉండటంతో, షూటింగును వాయిదా వేసుకుని మరీ అమెరికా వెళుతున్నాడు. అమెరికాలో సర్జరీ పూర్తయిన తరువాత రెండు నెలల పాటు ఆయన విశ్రాంతి తీర్చుకోవలసి ఉంటుందట.

ఆ తరువాతనే మళ్లీ ఆయన 'సర్కారువారి పాట' షూటింగులో పాల్గొననున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు.

అందువలన ఎంతవరకూ షూటింగు చేయవలసి ఉంది అనే విషయంలో ఒక క్లారిటీ ఉండటం వలన, మహేశ్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. బాలకృష్ణ టాక్ షో నుంచి ఆహ్వానం అందడంతో, అమెరికా వెళ్లడానికి ముందే ఈ షూటింగులో మహేశ్ పాల్గొననున్నాడు.

బాలకృష్ణతో కలిసి మహేశ్ బాబు స్టేజ్ ను పంచుకున్నది చాలా తక్కువ. అలాంటిది 'అన్ స్టాపబుల్' వేదికపై ఇద్దరూ కనిపించనున్నారు. బాలకృష్ణ ఏ విషయాన్నైనా చాలా సూటిగా అడిగేస్తారు .. అంతకంటే ఎక్కువ సూటిగా అడిగేస్తారు. మహేశ్ బాబుకి మాత్రం కాస్త మొహమాటం ఎక్కువే. గతంలో కంటే కాస్త తగ్గినప్పటికీ అది పూర్తిగా పోలేదు.

అయితే మాట్లాడేది తక్కువే అయినా వాటిలో కొసమెరుపులు ఉంటాయి. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో రానున్న ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి..