Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఉద్య‌మంలో స్టారాధి స్టార్లు సైతం

By:  Tupaki Desk   |   12 Sep 2019 8:19 AM GMT
కేటీఆర్ ఉద్య‌మంలో స్టారాధి స్టార్లు సైతం
X
స‌మాజానికి ఇది చెయ్యాలి.. అది చెయ్యాలి అంటూ స్పీచ్ లు దంచ‌డంలో రాజ‌కీయ నాయ‌కులు ముందు వ‌రుస‌లో ఉంటారు. అయితే ప్రాక్టిక‌ల్ గా చేసేది ఎంద‌రు? అన్న‌ది ప్ర‌జ‌లు చూస్తూనే ఉంటారు. ఇత‌ర నాయ‌కుల‌తో పోలిస్తే సేవా కార్య‌క్ర‌మాల్లో.. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో తెలంగాణ రాష్ట్ర యువ‌మంత్రి కేటీఆర్ ఎంతో అడ్వాన్స్ డ్ గా ఉంటూ ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రుస్తుండ‌డం యూత్ లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. సంద‌ర్భం ఏదైనా అందుబాటులో ఉన్న‌ సాంకేతిక‌త‌ను స‌త్వ‌రం ఉప‌యోగించుకుని ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయ‌డంలో కేటీఆర్ శైలి వేరు అన్న ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న చేసే ప్ర‌తి ట్వీట్ తెలంగాణ యువ‌తలోకి దూసుకెళుతోంది.

అయితే చెయ్యి చెయ్యి క‌లిస్తే అదో ఉద్య‌మం అవుతుంది. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ కి ప్ర‌తి ట్వీట్ చేయ‌డం ద్వారా మ‌న స్టార్లు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌- యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా లైన్ లోకి వ‌చ్చి ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేయ‌డంలో భాగం అవ్వ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో క‌లిసి పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేస్తున్న తాజా ప్ర‌చారానికి విస్త్ర‌త స్పంద‌న వ‌స్తోంది. ఇంత‌కీ ఆ ఇద్ద‌రూ ఏం చేశారు? అంటే...

ప్ర‌స్తుతం వైర‌ల్ ఫీవ‌ర్ల‌తో హైద‌రాబాద్ న‌గ‌రం అల్ల‌క‌ల్లోలం అవుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏ చోట చూసినా జ్వ‌రాల మోతే. ప్ర‌భుత్వ ఆస్పత్రులు కిట‌కిట‌లాడుతున్నాయి. వర్షాలు వాటితో పాటే వ్యాప్తి చెందుతున్న వైర‌ల్ జ్వ‌రాలు పెను ప్ర‌మాద‌క‌రంగా మారాయి. ప‌రిశుభ్ర‌త లోపించిన చోట దోమ‌ల వ‌ల్ల డెంగీ వంటి ప్ర‌మాద‌క‌ర జ్వ‌రాలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ప‌రిస‌రాల‌ ప‌రిశుభ్ర‌త చాలా స‌మ‌స్య‌ల‌కు సొల్యూష‌న్ అని చెబుతూ మంత్రి కేటీఆర్ స్వ‌యంగా త‌న ఇంటి చుట్టూ దోమ‌ల మందును చ‌ల్లారు. ఆ ఫోటోల్ని - వీడియోల్ని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేయ‌డంతో వీటికి విస్త్ర‌త ప్ర‌చారం వ‌స్తోంది. యువ‌త‌రం స‌హా ప్ర‌జ‌లు సామాజిక మాధ్యమాల్లో వీటిని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. అయితే ప్ర‌భాస్- మ‌హేష్ లాంటి స్టార్లు తోడై ఈ ప్ర‌చారం హోరెత్తించ‌డం ఆహ్వానించ‌ద‌గిన‌ది.

స‌మాజ హితం కోసం టాలీవుడ్ హీరోలు అన్నివేళ‌లా ముందుంటారు. అవ‌స‌రం మేర తమ వంతు సహకారం అందిస్తున్నారు. వైరల్ ఫీవర్.. డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధుల నివారణకు ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ సిబ్బంది కృషి చేస్తున్నారు. దోమల నివారణకు.. పరిశుభత్రకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్ర‌తిచోటా పరిశుభ్రంగా ఉంచుకోండి. నీరు నిలవ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. పూల కుండీలు- కూలర్లు.. ఇతర నీరు నిలిచే వస్తువులను తనీఖీ చేయండని కేటీఆర్ కోరారు. కేటీఆర్ ట్వీట్స్ ని ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా షేర్ చేసి ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. దీంతో ఇది చూసి కేటీఆర్ డార్లింగ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మరోవైపు కేటీఆర్ ట్వీట్స్ ని సూపర్ స్టార్ మహేష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి ప్రజల్లో చైతన్యం నింప‌డం ఉత్సాహం పెంచింది.

ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరిన మేర‌కు ఈ ప్ర‌చారోద్య‌మానికి స్టార్ల సాయం పెద్ద స్థాయిలో క‌లిసొస్తోంది. ఈ ఉద్య‌మంలో మ‌హేష్- ప్ర‌భాస్ త‌ర‌హాలోనే మెగా హీరోలు.. అక్కినేని హీరోలు .. నంద‌మూరి హీరోలు చేరితే ఇంకా పెద్ద స్థాయికి చేరుతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌న స్టార్లు కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్నా ఒత్తిడిలో ఉన్నా అప్పుడ‌ప్పుడు ఇలా సామాన్య ప్ర‌జ‌ల వైపు చూస్తుండ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. ప్ర‌జాసేవే మాధ‌వ సేవ అని గుర్తించినందుకు స్టార్ల‌కు శుభాభివంద‌నాలు.