అమెరికా లో సూపర్ స్టార్ కు దెబ్బ పడిందే!

Mon Jan 27 2020 16:07:35 GMT+0530 (IST)

Mahesh Babu Sarileru Neekevvaru Movie Collections Slow Down In Usa

అమెరికా మార్కెట్ లో కింగ్ అనిపించుకోవడం ఆషామాషీ కాదు. ఎందుకంటే రొటీన్ సినిమాలకు ఇక్కడ లోకల్ గా జేజేలు పలుకుతారేమో కానీ ఎన్నారై ఆడియన్స్ మాత్రం మొహమాటం లేకుండా తిప్పికొడతారు. కంటెంట్ ఉంటే తప్ప ఓవర్సీస్ లో సినిమా హిట్ కాదు. అలాంటిది రెగ్యులర్ గా హిట్స్ నమోదు చేస్తూ కింగ్ అనిపించుకోవడం కష్టమైన పనే అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం క్రితమే ఆ ఫీట్ సాధించారు. అయితే ఈమధ్య మాత్రం మహేష్ రెగ్యులర్ గా అమెరికా లో నిరాశపరుస్తూ తన ఓవర్సీస్ కింగ్ టాగ్ ను పోగొట్టుకున్నారు.అమెరికాలో మహేష్ బాబు మార్కెట్ ఎక్కువ అనే ఉద్దేశంతో ఆకాశాన్నంటే ధరలకు ఓవర్సీస్ రైట్స్ అమ్ముతూ ఉండడంతో సినిమాలు బ్రేకీవెన్ కావడం లేదు. మహేష్ తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సంగతే తీసుకుంటే ఇప్పటి వరకూ 2.5 మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేయలేకపోయింది. అదే సంక్రాంతి పోటీలో రిలీజ్ అయిన 'అల వైకుంఠపురములో' 3 మిలియన్ డాలర్ మార్క్ దాటి ఇంకా కూడా దూసుకుపోతోంది. సేఫ్ గేమ్ పేరిట మహేష్ ఒక మూసలో ఉండే సినిమాలు చేస్తూ ఉండడంతో ఓవర్సీస్ ఆడియన్స్ లో క్రేజ్ తగ్గిందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మహేష్ సినిమాలు ఇలానే కొన సాగితే ఫ్యూచర్ లో 2 మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేయడం కూడా కష్టమేననే టాక్ వినిపిస్తోంది. లోకల్ గా అయితే 'మ్యాజిక్' కలెక్షన్స్ తో హిట్టు అనిపించుకోవచ్చు కానీ అమెరికా లో అలా వర్క్ అవుట్ కాదని అంటున్నారు.

ఓవర్సీస్ మార్కెట్ లో మహేష్ మళ్ళీ తన సత్తా చాటుకోవాలంటే మాత్రం ఈసారి మంచి కంటెంట్ అని ప్రచారంలో ఊదర గొట్టే సినిమాలతో కాకుండా నిజంగా మంచి కంటెంట్ ఉండే సినిమాలతో రావాల్సిందే. లేకపోతే మహేష్ మార్కెట్ మరింత గా దిగజారడం ఖాయమేనని అంటున్నారు.