Begin typing your search above and press return to search.

రాజమౌళి - త్రివిక్రమ్ సినిమాలపై మహేశ్ ఏమన్నారంటే..!

By:  Tupaki Desk   |   9 Aug 2022 8:33 AM GMT
రాజమౌళి - త్రివిక్రమ్ సినిమాలపై మహేశ్ ఏమన్నారంటే..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో ఫుల్ ఫార్మ్ లో దూసుకుపోతున్నారు. ఈ మధ్య తాను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే అని మహేషే అన్నారంటే.. ప్రస్తుతం ఆయన కెరీర్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల 'సర్కారు వారి పాట' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టార్ హీరో.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేశారు. నిర్మాతగా 'మేజర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. దీని తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు సినిమాలూ భారీ స్థాయిలో తెరకెక్కనున్నాయి.

తమ అభిమాన హీరో తదుపరి సినిమాల కోసం రాజమౌళి - త్రివిక్రమ్ వంటి ఇద్దరు అగ్ర దర్శకులతో చేతులు కలుపుతున్నందుకు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మహేష్ సైతం ఈ సినిమాల పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు.

నేడు (ఆగస్ట్ 9) మహేశ్ బాబు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మహేష్ బాబు తన సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

రాజమౌళితో సినిమా అంటే ఒకేసారి 25 చిత్రాలకు పని చేయడం లాంటిదని.. ఇందులో తన పాత్ర శారీరక శ్రమతో కూడుకున్నదని మహేశ్ తెలిపారు. ఇది పాన్ ఇండియా మూవీ అని సూపర్ స్టార్ ధృవీకరించారు. ఈ సినిమా గురించి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెప్పారు.

అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వర్క్ చేయడం గురించి మాట్లాడుతూ.. తమ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని మహేష్ బాబు వెల్లడించారు. మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో గతంలో 'అతడు' 'ఖలేజా' వంటి సినిమాలు వచ్చాయి.

దాదాపు పడమూడేళ్ల విరామం తర్వాత ఇప్పుడు SSMB28 కోసం దర్శక హీరోలు మళ్లీ చేతులు కలిపారు. ఆగస్టు 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని షెడ్యూల్ వేసుకున్నారు. అలానే వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

ఇదే క్రమంలో మహేష్ జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో రాజమౌళి సినిమా కోసం అందుబాటులో ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి మరియు అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ కలిసి స్టోరీ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ లో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కేక్స్ కట్ చేసి బర్త్ డే ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు.