Begin typing your search above and press return to search.

నా స్టాట్యూకి ప్రాణం పోశారు - మ‌హేష్‌

By:  Tupaki Desk   |   25 March 2019 9:05 AM GMT
నా స్టాట్యూకి ప్రాణం పోశారు - మ‌హేష్‌
X
ఏఎంబీ మాల్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ విగ్ర‌హానికి సంద‌ర్శ‌కుల నుంచి అద్భుత‌మైన ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. అభిమానులు ఈ విగ్ర‌హంతో సెల్ఫీ దిగేందుకు పోటీ ప‌డుతున్నారు. అయితే ఈ విగ్ర‌హాన్ని హైద‌రాబాద్ ఏఎంబీలోనే ఆవిష్క‌రించ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే .. మ‌హేష్ చెప్పిన ఆన్స‌ర్ ఇది. వాస్త‌వానికి సింగ‌పూర్ టుస్సాడ్స్ లోనే మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాల‌ని భావించారు. అయితే మ‌హేష్ కి కాల్షీట్ల స‌మ‌స్య త‌లెత్తిందిట‌. అందువ‌ల్ల హైద‌రాబాద్ లోనే విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించేలా టుస్సాడ్స్ నిర్వాహ‌కుల్ని కోరామ‌ని తెలిపారు. ఆరేళ్ల క్రిత‌మే నేను మ్యాడ‌మ్ టుస్సాడ్స్ ని సంద‌ర్శించిన‌ప్పుడు అక్క‌డ విగ్ర‌హాలు చూసి.. నా పిల్ల‌లు సితార‌ - గౌత‌మ్ ఎంతో ఎగ్జ‌యిట్ అయ్యారు. ఏదో ఒక రోజు నా విగ్ర‌హం ఇక్క‌డ ఆవిష్క‌రించాల‌ని అనుకున్నా.. ఇప్ప‌టికి అది నిజ‌మైంది! అంటూ మ‌హేష్ ఆనందం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ లో ఆవిష్క‌రించ‌డం వ‌ల్ల త‌న అభిమానులు, పిల్ల‌ల ఆనందానికి అవ‌ధులే లేవ‌ని మ‌హేష్ అన్నారు. సింగ‌పూర్ కి ఈ విగ్ర‌హాన్ని పంపించే వ‌ర‌కూ ఇక్క‌డే అభిమానుల‌తో క‌లిసి ఆస్వాధిస్తార‌ని తెలిపారు.

మ‌హేష్ మాట్లాడుతూ ``సినీ ప్రియుల మ‌ధ్య నా విగ్ర‌హాన్ని ఇలా విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. గ‌తేడాది టుస్సాడ్స్ నిర్వాహ‌కులు నన్ను సంప్ర‌దించి నా కొల‌త‌ల్ని తీసుకున్నారు. ర‌క‌ర‌కాల క‌ళ్లను.. రంగు రంగుల జుట్టును తీసుకొచ్చి నాతో పోల్చి చూశారు. ఏవో కొల‌త‌లు తీసుకుని మామూలుగా చేస్తున్నార‌ని అనుకున్నా. కానీ నా విగ్ర‌హాన్ని మ‌లిచిన తీరు వండ‌ర్ ఫుల్ గా ఉంది. న‌న్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది. నా విగ్ర‌హానికి వారు ప్రాణం పోశారు. ఇవాన్ రీజ్, బెంటానా & టీమ్ కి నా కృత‌జ్ఞ‌త‌లు`` అన్నారు. నాకు నా విగ్ర‌హాన్ని చూస్తుంటే ఆనందంగా, అద్వితీయంగా.. గొప్ప‌గా.. ఉత్కంఠ‌గా.. ఒకింత భ‌యంగా.. అన్ని భావాల్ని క‌లగ‌లిసిన‌ట్టుగా ఉంది. భార‌త‌దేశానికి చెందిన ప‌లువురు సెల‌బిట్రీల బొమ్మ‌లు అక్క‌డున్నాయ‌ని నాకు తెలుసు. నా ఫ్యామిలీతో క‌లిసి సింగ‌పూర్ టుస్సాడ్స్ కి విజిట్ చేస్తాను.. అని అన్నారు.

మ్యాడ‌మ్ టుస్సాడ్స్ నిర్వాహ‌కులు మాట్లాడుతూ ``మొద‌టి సారి ఇలా సింగ‌పూర్ లో కాకుండా వేరొక చోట‌ విడుద‌ల చేస్తున్నాం. తొలిసారి హైద‌రాబాద్‌ కు వ‌చ్చాం. తెలుగు సినిమా స్టార్ స్టాట్యూని సింగ‌పూర్‌ లో విడుద‌ల చేయ‌డం కూడా ఇదే తొలిసారి. మ‌హేష్‌ని ఎంతో మంది అభిమానులు కోరుకున్న త‌ర్వాత‌నే ఎంపిక చేసుకున్నాం. షారుఖ్‌ఖాన్‌, అమితాబ్‌ బ‌చ్చ‌న్‌, ఇప్పుడు మ‌హేష్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.