మహేష్-జక్కన్న మూవీ... బాహుబలి తో సంబంధం ఏంటి?

Mon Jul 04 2022 05:00:01 GMT+0530 (IST)

Mahesh Babu Rajamouli Movie

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. బాహుబలి తో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ను దక్కించుకున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో సందడి చేస్తున్నాడు. ఎన్నో దేశాల్లో ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడి మీడియా ల్లో ప్రతి రోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.బాహుబలి మరియు ఆర్ ఆర్ ఆర్ ను అద్బుతమైన విజువల్ వండర్స్ గా.. హాలీవుడ్ సినిమా ల వీఎఫ్‌ఎక్స్ వర్క్ కు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాజమౌళి తన సినిమా ల్లో వీఎఫ్‌ఎక్స్ వర్క్ ను చేయించాడు. త్వరలో మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమా కోసం ఇప్పటి నుండే వీఎఫ్‌ఎక్స్ టీమ్ ను రెడీ చేస్తున్నాడు.

ఇటీవల రాజమౌళి కమల్ కన్నన్ తో కలిసి పారిస్ లోని యూనిట్ ఇమేజ్ అనే అంతర్జాతీయ స్థాయి వీఎప్‌ఎక్స్ కంపెనీని సందర్శించాడు. ఆ సందర్బంగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా రాజమౌళి తో ఉన్నారు. మహేష్ బాబు తో రాజమౌళి చేయబోతున్న సినిమాను కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు అనేది చాలా కాలంగా వస్తున్న వార్తల సారాంశం.

రాజమౌళి కూడా కేఎల్ నారాయణ బ్యానర్ లో మహేష్ తో సినిమా ను చేయాలని ప్రకటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ బ్యానర్ లోనే సినిమా ఉంటుంది. మరి బాహుబలి నిర్మాత పారిస్ టూర్ లో ఎందుకు భాగస్వామ్యం అయినట్లు అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. రాజమౌళి తో సినిమా అంటే భారీ బడ్జెట్ ను పెట్టాల్సి ఉంటుంది. అందుకే కేఎల్ నారాయణ తో పాటు బాహుబలి నిర్మాత శోభు కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారనే వార్తలు కూడా వస్తున్నాయి.

బాహుబలి సినిమా తో రాజమౌళి భారీ విజయాన్ని సొంతం చేసుకుని నిర్మాత శోభు యార్లగడ్డ కు లాభాల పంట పండించారు. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు సినిమా కోసం వీరిద్దరు కలిస్తే ఖచ్చితంగా బాహుబలి రేంజ్ విజయం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్.. జక్కన్న మూవీ కి బాహుబలి నిర్మాత తో కనెక్షన్ గురించి త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.