దర్శకధీరుడు వెనక్కెళితే రేసులో తిరకాసే

Thu Apr 22 2021 22:00:01 GMT+0530 (IST)

Mahesh Babu Rajamouli Combo Movie

సూపర్ స్టార్ మహేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్లాన్ చేస్తూ కెరీర్ పరంగా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట తెరకెక్కుతోంది. సెకండ్ వేవ్ వల్ల కొద్దిరోజుల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కచ్ఛితంగా ఎస్.ఎస్.రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. రాజమౌళికి మహేష్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణను పూర్తి చేస్తున్న రాజమౌళి తదుపరి మహేష్ తో సినిమా కోసం పని చేస్తారన్న టాక్ కూడా బలంగా ఉంది.అయితే ఈలోగానే మహేష్ మరో రెండు సినిమాల్ని పూర్తి చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారన్న కథనాలు ప్రస్తుతం వేడెక్కిస్తున్నాయి. మహేష్ ఇప్పటికే త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అతడు స్క్రిప్టును వందశాతం సిద్ధం చేసి మహేష్ తో సెట్స్ కెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో 2021 ఎండ్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది.

ఈలోగానే ఆకాశం నీ హద్దురా- గురు చిత్రాల దర్శకురాలు సుధా కొంగరతో మరో సినిమా చేస్తారన్న కథనాలు తాజాగా తెరపైకి వచ్చాయి. సుధా ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసి మహేష్ కోసం రెడీగా ఉన్నారట. త్రివిక్రమ్ సినిమాతో పాటు సైమల్టేనియస్ గా ఈ సినిమాని కూడా వేగంగా పూర్తి చేసి తదుపరి రాజమౌళితో సెట్స్ కెళ్లే ప్లాన్ లో మహేష్ ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇవేవీ మహేష్ కాంపౌండ్ నుంచి అధికారికంగా కన్ఫామ్ కాలేదు.

అయినా మహేష్ ఇలా ఇతర సినిమాల కోసం రాజమౌళిని వెనక్కి నెట్టాల్సిన అవసరం ఏం ఉంది? అంటే.. రెండేళ్ల పాటు  జక్కన్నతోనే మహేష్ లాక్ అవ్వాల్సి ఉంటుందట. అది భారీ పాన్ ఇండియా సినిమా కాబట్టి బల్క్ గా కాల్షీట్లు అవసరం. అయితే దర్శకధీరుడిని వెనక్కి నెట్టడం ద్వారా మహేష్ పాన్ ఇండియా రేసులో వెనక్కి వెళ్లినట్టే. ఓవైపు ప్రభాస్.. మరో వైపు చరణ్- తారక్ -బన్ని ఈ రేసులో వడి వడిగా అడుగులు వేస్తూ ముందుకెళుతున్నారు. ఇలాంటప్పుడు రాజమౌళిని పక్కన పెట్టి ఇతర సినిమాలు చేసయడం సరైనదేనా? అన్నది మహేష్ ఆలోచించుకోవాలి. ఒకసారి రాజమౌళితో సినిమా చేశాక.. ఆ తర్వాత అతడికి పాన్ ఇండియా స్టార్ డమ్ ఆపాదించబడుతుంది. తర్వాత వచ్చేవన్నీ పాన్ ఇండియా కేటగిరీనే. అలా కాకుండా మహేష్ ఆలోచన ఎలా ఉంది? అన్నది వేచి చూడాలి.