టాలీవుడ్ రాజకుమారుడు వచ్చి అప్పుడే ఇన్నాళ్లయ్యిందా?

Sat Jul 31 2021 13:21:04 GMT+0530 (IST)

22 Years For Rajakumarudu Movie

సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడిగా చిన్నప్పుడే చాలా సినిమాల్లో నటించిన మహేష్ బాబు హీరోగా అనగానే ఈ కుర్రాడు అప్పుడే హీరో ఏంటీ మొన్నటి వరకు బాల నటుడిగానే కనిపించాడు కదా అంటూ చాలా మంది పెదవి విరిచారు. కాని మహేష్ బాబును దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మొదటి సినిమాతోనే అందరి దృష్టిలో హీరోగా గుర్తుండి పోయేలా చేశాడు. బాల నటుడు కాస్త హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో సరైన సినిమా పడితే తప్ప ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకోవడం కష్టం. అటువంటిది మహేష్ బాబుకు మొదటి సినిమా రాజకుమారుడు తోనే హీరోగా స్టార్ డం దక్కింది.అమ్మాయిల హృదయాల్లో రాజకుమారుడిగా నిలిచి పోయేలా మహేష్ బాబు మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. సూపర్ హిట్ కాంబినేషన్ రాఘవేంద్ర రావు మరియు అశ్వినీదత్ లు ఈ సినిమాతో మహేష్ బాబును పరిచయం చేశారు. 1999 లో విడుదల అయిన రాజకుమారుడు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మొదటి సినిమా తోనే మహేష్ బాబుకు ప్రిన్స్ అనే పేరు ట్యాగ్ లైన్ వచ్చేసింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింతా నటించింది. ఆ సినిమాలో ఇద్దరి మద్య రొమాన్స్ అప్పట్లో సంచలనంగా నిలిచింది. పాటలు మొదలుకుని కామెడీ.. యాక్షన్.. డ్రామా అన్ని విధాలుగా రాజకుమారుడు సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

మొదటి సినిమా అంతగా ఫౌండేషన్ వేసింది కనుకే మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ గా నిలిచాడు అంటూ చాలా మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. మొదటి సినిమా నుండే అమ్మాయిల హృదయాల్లో నిలిచి పోయే పాత్రలు చేస్తూ వస్తున్న మహేష్ బాబు ఇప్పటికి కూడా ఆయన తన క్రేజ్ ను పెంచుకుంటూ.. అభిమానులను మరింతగా పెంచుకుంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ గా నిలిచి పోయాడు. మహేష్ బాబు రాజకుమారుడు సినిమా వచ్చి 22 ఏళ్లు అయ్యింది అంటే అప్పుడేనా అంటూ చాలా మంది నోరు వెళ్లబెడుతారు. ఎందుకంటే ఆయన చూడ్డానికి ఇంకా మూడు పదుల వయసు వ్యక్తిగానే కనిపించడంతో పాటు ఇంకా ఆయన కనీసం ముప్పై సినిమాలు కూడా చేయలేదు. కనుక ఆయన వచ్చి 22 ఏళ్లు అయ్యింది అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది.

భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఆకట్టుకునే నటనతో ఎప్పటికప్పుడు తన స్టార్ డమ్ ను పెంచుకుంటూ ఉన్న మహేష్ బాబు. ప్రస్తుతం ఈయన సర్కారు వారి పాట సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అంటూ మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 22 ఏళ్లు అయినా కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోగానే దూసుకు పోతున్న మహేష్ బాబు మరో 22 ఏళ్లు అయినా కూడా హీరోగా టాప్ స్టార్ గానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ కు రాజకుమారుడితో ఒక రాజకుమారుడిని ఇచ్చిన రాఘవేంద్ర రావుకు అభిమానులు కృతజ్ఞతలు చెబుతున్నారు.