మహేష్ అమెరికా మార్కెట్ డ్యామేజ్ అవుతోందా?

Sat Jan 18 2020 10:53:42 GMT+0530 (IST)

Mahesh Babu Overseas Market Gets Damage with Sarileru Neekevvaru Movie

మహేష్ బాబును మనం సూపర్ స్టార్ అని పిలుచుకుంటాం కానీ మహేష్ కు మరో బిరుదు ఉంది.. అదే ఓవర్సీస్ కింగ్.  పెద్ద సౌత్ స్టార్ హీరోలు.. బాలీవుడ్ తోపులు కూడా వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ మార్క్ టచ్ చేసేందుకు ముక్కి మూలుగుతున్న సమయంలోనే అలవోకగా మహేష్ సినిమాలు 1 మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేసేవి. మిగతా స్టార్ లు 1 మిలియన్ సాధిస్తే మహేష్ సినిమాలు రెండు.. మూడు మిలియన్లు సాధించేవి. అయితే గత కొంతకాలంగా మహేష్ ఓవర్సీస్ మార్కెట్ తిరోగమనంలో ఉంది.మహేష్ మార్కెట్ ఎక్కువ కదా అని ఓవర్సీస్ రైట్స్ ను ఎక్కువ రేట్లకు అమ్ముతూ ఉండడంతో అవి బ్రేక్ ఈవెన్ కావడం లేదు.  మహేష్ తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' విషయమే తీసుకుంటే నిర్మాతలకు సన్నిహితులైన వారిద్వారా రిలీజ్ చేసుకున్నారు.  ఇతర సంక్రాంతి సినిమాలాతో పోలిస్తే ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. టికెట్ రేట్స్ కూడా ఎక్కువే పెట్టారు.  అయినా ఆశించిన స్పందన దక్కలేదని అంటున్నారు.  కలెక్షన్స్ అంత వచ్చాయి.. ఇంత వచ్చాయి అని భారీ నంబర్లతో పోస్టర్లు వేసుకుంటున్నారనే టాక్ ఉంది.  మహేష్ కు ఓవర్సీస్ లో భారీ ఫాలోయింగే ఉన్నప్పటికీ ఈ సినిమా మాస్ మసాలా కావడంతో అక్కడి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. అనిల్ రావిపూడి సినిమాలకు ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ దక్కదు.  అది కూడా ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించిందని అంటున్నారు..

యూ ఎస్ వరకూ తీసుకుంటే సంక్రాంతి రేస్ లో 'సరిలేరు నీకెవ్వరు' వెనకపడిపోయింది.  ఇప్పటికే థియేటర్లు ఖాళీ సీట్లతో కనిపిస్తున్నాయట. ఏవైనా కలెక్షన్స్ వస్తే గిస్తే ఈ ఆదివారం వరకేనని.. ఆ తర్వాత నామ్ కే వాస్తే కలెక్షన్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుందని అంటున్నారు. బైట ప్రచారంలో ఉన్న కలెక్షన్స్ సంగతేమో కానీ ఫుల్ రన్ లో ఓవర్సీస్ లో ఈ సినిమాకు 5 కోట్ల నష్టం వాటిల్లేలా ఉందని సమాచారం.   ఏదేమైనా మహేష్ తన సినిమాలు ఒకే చేసే సమయంలో ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మహేష్ యూఎస్ మార్కెట్ మరింతగా దిగజారే సూచనలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.