మహేశ్ బాబు ఇంట విషాదం.. అమ్మ ఇక లేదు

Wed Sep 28 2022 08:49:39 GMT+0530 (India Standard Time)

Mahesh Babu Mother Indira Devi Passes Away

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్.. ఏఎన్నార్ తర్వాత మరెవరికీ రాని 'సూపర్ స్టార్' ఖ్యాతిని గడించిన ఘట్టమనేని క్రిష్ణ సతీమణి.. మహేశ్ బాబు అమ్మ ఇందిరా దేవి ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున కన్నుమూశారు. గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.క్రిష్ణ.. ఇందిరాదేవిలకు ఐదుగురు సంతానం. కొడుకు రమేశ్ బాబు.. మహేశ్ బాబుతో పాటు కుమార్తెలు పద్మావతి.. మంజుల.. ప్రియదర్శినిలు ఉన్నారు. వీరిలో ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగులో హీరోగా నటిస్తున్నారు. మంజుల.. ఆమె భర్త కూడా అప్పుడప్పుడు సినిమాల్లో నటించటం తెలిసిందే.

కొద్ది నెలల క్రితమే అనారోగ్యంతో ఉన్న కొడుకు రమేశ్ బాబు మరణించటం తెలిసిందే. ఆ విషాదంలో నుంచి ఇప్పటికి బయటకురాలేని వేళలో.. తాజాగా ఇందిరాదేవి మరణంతో మహేశ్ కుటుంబం తీవ్ర విషాదంతో మునిగిపోయింది. ఆమె మరణం పట్ల పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అంత్యక్రియులు ఎక్కడ జరుగుతాయి? అన్న విషయంపై క్రిష్ణ.. మహేశ్ లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరికాసేపట్లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే వీలుంది.