Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ 'వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే' ఎమోషనల్ పోస్ట్...!

By:  Tupaki Desk   |   5 Jun 2020 6:30 AM GMT
సూపర్ స్టార్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎమోషనల్ పోస్ట్...!
X
నేడు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. అభివృద్ధి అంటూ మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దానికి ఆధారం పంచభూతాలు అనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి. గాలి, నీరు, నిప్పు, నేల, నింగి అనే పంచభూతాల వలనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మానవుల జీవనం అస్తవ్యస్తమవుతుంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ ఉపరితలంపై ఉన్న సహజ వనరులు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగిపోయింది. రాబోయే కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయి పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకూ భూగోళంపై పచ్చదనం తగ్గిపోవడం.. కొన్ని రకాల జీవరాశులు నశించిపోవడం వలన పర్యావరణానికి పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ప్రకృతి గొప్పదనం చెప్పడానికి.. పర్యావరణాన్ని రక్షించాలని ప్రతీ ఏటా జూన్ 5న అవగాహన కలిగిస్తుంటారు. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌ తో ఎన్విరాన్మెంట్ సదస్సులను నిర్వహిస్తూ ఉంటారు. గతేడాది 'బీట్ ఎయిర్ పొల్యూషన్' పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ ఏడాది ''టైమ్ ఫర్ నేచర్'' థీమ్‌ ను ఎంపిక చేసారు. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడాలంటూ ఎంతో మంది ప్రముఖులు ప్రజలకు పిలుపునిస్తున్నారు.

వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇది పర్యావరణాన్ని కాపాడాల్సిన సమయం అంటూ దలైలామ కొటేషన్‌ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. 'మనమందరం నివసించే పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి వ్యక్తిగత బాధ్యత' - దలైలామా. మనము ప్రకృతితో ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాము. ప్రకృతిని రక్షించడం ద్వారా మనల్ని మనం రక్షించుకుంటాము. మనందరం సంతోషంగా జీవించాలంటే, ఆరోగ్యకరమైన మరియు సమతుల్య పర్యావరణ వ్యవస్థను సృష్టించడం చాలా ముఖ్యం. మనమందరం ఇంట్లో సురక్షితంగా ఉంటూ మన గొంతుకను ప్రపంచానికి వినిపించాలి. మన చేసే పనులు మాటలు మారాల్సి ఉంది. భవిష్యత్తు మనపై ఆధారపడి ఉంది. నీటిని ఆదా చేయండి.. చెట్లను కాపాడండి.. విద్యుత్తును ఆదా చేయండి.. కార్బన్ ఉద్గారాలను తగ్గించండి.. అడవులను కాపాడండి.. మన మహాసముద్రాలను కాపాడండి.. జంతువులను రక్షించండి. మీకు ముఖ్యమైనది ఏమిటో ఎంచుకోండి. ఈ రోజు ప్రారంభించండి. దీన్ని కలిసి చేద్దాం' అంటూ పోస్ట్ చేసాడు మహేష్ బాబు. ''ఇట్స్ టైం ఫర్ నేచర్.. పర్యావరణాన్ని రక్షించండి సేఫ్ గా ఉండండి'' అంటూ మహేష్ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.