Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ఫస్ట్‌ రూ.100 కోట్ల 'మగధీర'కు పుష్పరం

By:  Tupaki Desk   |   31 July 2021 5:30 PM GMT
టాలీవుడ్ ఫస్ట్‌ రూ.100 కోట్ల మగధీరకు పుష్పరం
X
టాలీవుడ్‌ సినిమా 25 నుండి 30 కోట్లు వసూళ్లు చేస్తే చాలా పెద్ద హిట్‌ అనుకుంటూ ఉన్న సమయంలో... 30 నుండి 40 కోట్లు వసూళ్లు చేస్తే ఇండస్ట్రీ హిట్‌ అంటూ లెక్కలు ఉన్న సమయంలో 50 కాదు 60 కాదు ఏకంగా 100 కోట్లకు మించిన వసూళ్లు సాధించిన చిత్రం మగధీర. ఈ సినిమా విడుదల అయ్యి పుష్కర కాలం పూర్తి అయ్యింది. ఏదైనా ఒక పుష్కర కాలం ఉంటే దాన్ని గురించి పట్టించుకోవడం మానేస్తారట. కాని మగధీర సినిమా గురించి ఇప్పటికి ఎప్పటికి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమకు మొదటి వంద కోట్లను పరిచయం చేసిన మూవీ అవ్వడంతో పాటు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించిన సినిమా మగధీర. అందుకే తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం మగధీర గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం అనడంలో సందేహం లేదు.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర సినిమా హీరో రామ్‌ చరణ్ కు రెండవ సినిమానే. అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించాడు. అప్పటి వరకు పాతిక కోట్ల బడ్జెట్‌ అంటే చాలా ఎక్కువ అన్నట్లుగా టాక్‌ ఉండేది. పాతిక కోట్ల బడ్జెట్‌ సినిమాను భారీ బడ్జెట్‌ సినిమాగా భావిస్తున్న తరుణంలో ఈ సినిమాకు దాదాపుగా 35 కోట్లకు మించి బడ్జెట్‌ ను అల్లు అరవింద్‌ పెట్టాడు. కొత్త హీరో మీద ఇంత ఖర్చు ఏంటీ బాబోయ్‌ అన్నట్లుగా కామెంట్స్ వచ్చాయి.

ఎంత అల్లుడు అయితే మాత్రం కోట్లు కుమ్మరిస్తారా అంటూ అల్లు అరవింద్‌ పై అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వచ్చాయి. రాజమౌళి పై నమ్మకంతో పాటు ఆయన చెప్పిన కథపై అల్లు అరవింద్‌ కు అంతటి నమ్మకం కుదిరింది కనుకే అంతగా పెట్టాడు అనడంలో సందేహం లేదు. అల్లు అరవింద్ పెట్టిన దానికి ఎన్ని రెట్లు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి కూడా టీవీలో వస్తున్న సమయంలో టీవీలకు అతుక్కు పోయి కూర్చునే వారు ఎంతో మంది ఉంటారు. అలాంటి అద్బుతమైన సినిమా వచ్చి అప్పుడే 12 ఏళ్లు పూర్తి అయ్యింది.

రాజమౌళిని దర్శక ధీరుడిగా మార్చిన సినిమా మగధీర. రామ్‌ చరణ్‌ ను కేవలం రెండవ సినిమాతో టాలీవుడ్‌ లో టాప్ హీరోగా నిలబెట్టిన సినిమా మగధీర. కాజల్‌ ను సుదీర్ఘ కాలం పాటు తెలుగు లో హీరోయిన్‌ గా కొనసాగేలా చేసిన సినిమా కూడా ఇదే అనడంలో సందేహం లేదు. అంతటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ సక్సెస్ దక్కించుకున్న మగధీర సినిమా ఇంకో రెండు మూడు పుష్కరాల తర్వాత కూడా మాట్లాడుకుంటే అతిశయోక్తిగానే ఉంటుంది. గ్రాఫిక్స్‌ అవకాశాలు ఎక్కువగా లేని సమయంలో అద్బుతంగా దర్శకుడు రాజమౌళి విజువలైజ్ చేసి తనకున్న పరిజ్ఞానంతో అద్బుతమైన సెట్టింగ్స్‌ ను వేయించి చక్కగా చూపించాడు.

కథ విషయంలో చాలా చిన్న పాయింట్ అయినా కూడా దాన్ని చూపించిన విధానం మరియు దాన్ని మలచిన తీరు ఒక అద్బుతం అంటూ విశ్లేషకులు ఇప్పటికి కూడా మగధీర సినిమా గురించిన ప్రస్థావన వచ్చినప్పుడు వ్యాఖ్యలు చేస్తారు అనడంలో సందేహం లేదు. మగధీర ఇచ్చిన ఉత్సాహంతో రాజమౌళి అంతకు మించిన అద్బుతాలు తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఆయన ప్రస్తుతం రామ్‌ చరణ్‌ తో ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కూడా ఉన్నాడు. పుష్కర కాలం తర్వాత చరణ్‌.. రాజమౌళిల కాంబో మూవీ రాబోతుంది. మగధీర సినిమాను మరిపించేలా ఈ కాంబో సినిమా ఉండబోతుంది అనేది కన్ఫర్మ్.